No Headline
కోవూరు: పల్లెసీమల్లోని రైతు కుటుంబాలకు ఎడ్లంటే మమకారం. యాంత్రీకరణతో వ్యవసాయంలో వాటి ప్రాధాన్యత తగ్గిపోయింది. యువతీ, యువకులకు ఎడ్లతో అనుబంధాలు తెలియదు. రైతు కుటుంబాల నేతృత్వంలో ఏటా సంక్రాంతి సందర్భంగా కోవూరులోని కొత్తూరు రోడ్డులో రాష్ట్ర స్థాయిలో ఎడ్ల పోటీలు నిర్వహిస్తూ సంస్కృతి, సంప్రదాయాలను నేటి తరానికి పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పోటీలకు మన రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ ప్రాంతం నుంచి కూడా ఎడ్లను తీసుకొస్తుంటారు. దాదాపు 30 ఏళ్లుగా ఎలాంటి అపశ్రుతులు లేకుండా పోటీలను నిర్వహిస్తుండడం విశేషం. వీటిని తిలకించేందుకు యువకులు, రైతులు తరలివస్తారు.
పోషిస్తూ..
గ్రామీణ ప్రాంతాల్లో రైతు కుటుంబాలకు చెందిన కొందరు వివిధ రంగాల్లో స్థిరపడినా ఎడ్లను తమ ప్రాణంగా భావిస్తుంటారు. పోటీలకు వాటిని సిద్ధం చేసేందుకు నిత్యం పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నారు. దీని కోసం నెలకు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు చేస్తుండటం విశేషం. తమ ఎడ్లకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు రావాలనే పట్టుదలతో వాటికి పరుగు పందేల్లో శిక్షణ కూడా ఇప్పిస్తున్నారు.
ఐదు బహుమతులు
మూడు కిలోమీటర్ల మేర సాగే పరుగు పందెంలో మొదటి ఐదు స్థానాల్లో నిలిచిన ఎడ్ల జతలకు బహుమతులతోపాటు ట్రోఫీలు అందించనున్నారు. సాధారణ రైతులు నిర్వహించే ఈ పోటీల్లో విజేతలకు బహుమతులు ఇచ్చేందుకు కొందరు పోటీపడుతున్నారు. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ రంగంలో స్థిరపడిన వారంతా తమ తల్లిదండ్రులు, పూర్వీకుల జ్ఞాపకార్థంగా వేలాది రూపాయలను బహుమతుల రూపంలో అందిస్తున్నారు. మొదటి బహుమతి కింద రూ.40 వేలు, రెండో బహుమతిగా రూ.25 వేలు, మూడో బహుమతిగా రూ.20 వేలు, నాలుగో బహుమతిగా రూ.15 వేలు, ఐదో బహుమతిగా రూ.10 వేలతోపాటు ట్రోఫీలిస్తారు.
పోటీలకు ఎడ్లను సిద్ధం చేస్తూ..
సంక్రాంతి సందర్భంగా కోవూరులో ఎడ్ల పోటీలు
దశాబ్దాలుగా నిర్వహణ
నేడు రైతుల సమన్వయ కమిటీ
నేతృత్వంలో..
నేడు పోటీలు
కోవూరులో సోమవారం రాష్ట్ర స్థాయిలో పోటీలు జరుగుతాయి. ఇప్పటికే 35 ఎడ్ల జతలు నమోదయ్యాయి. పోటీ లు నిర్వహించే ప్రదేశంలో ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment