వివాహిత ఆత్మహత్య
బుచ్చిరెడ్డిపాళెం: వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలోని అంజనాద్రి నగర్‌లో ఆదివారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. పొంగూరు నర్మద (32) ఓజిలి మండలం వెందోడు గ్రామంలో ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తోంది. ఆమె భర్త శ్రీనివాసరెడ్డి స్థానికంగా ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగిగా ఉన్నాడు. భోగి మంటలు వేసేందుకు తాటాకుల కోసం శ్రీనివాసరెడ్డి తన కుమారుడితో కలిసి స్వగ్రామమైన బుచ్చిరెడ్డిపాళెం సమీపంలోని రెడ్డిపాళెం వెళ్లాడు. అక్కడే తల్లిదండ్రులతో ఉండి మధ్యాహ్నం తిరిగి ఇంటికి వచ్చారు. ఎంతసేపటికీ నర్మద తలుపులు తీయకపోవడంతో బంధువుల ఇంటికి వెళ్లి ఉంటుందని తండ్రీకొడుకులు భావించి గేటు వద్దే కూర్చొన్నారు. కాగా నర్మదకు ఫోన్ చేసినా స్పందన లేదు. ఈ సమయంలో పక్కింటి వారు వివాహానికి వెళ్లి తిరిగి రాగా వారితో నర్మద ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని శ్రీనివాసరెడ్డి చెప్పాడు. అందరూ కలిసి బెడ్‌రూమ్‌కి వెనుక వైపునున్న కిటికీ వద్దకు వెళ్లి అద్దాలు పగులగొట్టి చూడగా ఆమె ఉరేసుకుని ఉంది. వెంటనే పోలీసులకు తెలియజేయడంతో సీఐ శ్రీనివాసరెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. లోపలికి వెళ్లి చూసి అప్పటికే ఆమె మృతిచెందినట్లు గుర్తించారు. నర్మద తల్లిదండ్రులు చనిపోగా ఆమె, తమ్ముడిని నానమ్మ పెంచినట్లు తెలిసింది. నర్మద ఇటీవల తన కుమారుడి పదో సంవత్సరం పుట్టినరోజును వేడుక గా చేసినట్లు శ్రీనివాసరెడ్డి తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment