ప్రశాంతంగా.. వేధింపులు
వారి మాట వింటేనే
ప్రశాంతంగా ఉంటావ్..
లేకపోతే చెక్‌పవర్ కట్ అవుతుంది..
సాక్షి ప్రతినిధి, నెల్లూరు / కొడవలూరు: కోవూరు నియోజకవర్గంలో టీడీపీ నేతల అకృత్యాలు పరాకాష్టకు చేరుతున్నాయి. మండలానికి ఇన్‌చార్జిగా ఓ చోటా నేతను నియమించడంతో షాడో ఎమ్మెల్యేగా చెలరేగిపోతూ జులుం ప్రదర్శిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలను లక్ష్యంగా చేసుకొని వేధింపుల పర్వానికి తెరలేపుతున్నారు. ఇంత జరుగుతున్నా, చేష్టలుడిగి చూడటం జిల్లా అధికారుల వంతవుతోంది.
వేధింపుల పర్వం..
● నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీ మద్దతుదారులైన సర్పంచ్‌ల చెక్‌పవర్‌ను తొలగిస్తూ వికృత క్రీడకు తెరలేపారు. అధికార పార్టీ నేతలు చెప్పినట్లు నడుచుకోలేదనే నెపంతో కొడవలూరు మండలం పెమ్మారెడ్డిపాళెం, రేగడిచెలిక సర్పంచ్‌ల చెక్‌పవర్‌ను నిర్దాక్షిణ్యంగా తొలగించారు.
● కొత్తవంగల్లుకు చెందిన దళిత మహిళా సర్పంచ్ చేపట్టిన పనులకు ఎం బుక్‌ను రికార్డ్ చేయాలని కోరితే, టీడీపీ మండల ఇన్‌చార్జిని వ్యక్తిగతంగా కలిస్తే పని అవుతుందని వేధించారు.
● ప్రతిపక్ష పార్టీ మద్దతుదారులని తెలిస్తే చాలు మధ్యాహ్న భోజన నిర్వాహకుల మొదలుకొని ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, వీఓఏలు, చౌక డిపో డీలర్లను ఎడాపెడా తొలగిస్తున్నారు.
● నార్తురాజుపాళెం హైస్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని నిర్వహించే దళిత మహిళ యానాదమ్మకు రేషన్ ఇవ్వడాన్ని నిలిపేశారు. జీవనోపాధి కోల్పోయానని ఆమె మొత్తుకుంటున్నా, ఆమె మొర ఆలకించే నాథుడే కరువయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారు కావడమే ఆమె చేసిన నేరమనే రీతిలో చెలరేగిపోతున్నారు.
● తాము చెప్పినట్లు నడుచుకోవాలని, లేని పక్షంలో తొలగిస్తామంటూ ఉద్యోగులను అధికార పార్టీ నేతలు బెదిరిస్తున్నారు. ఫలితంగా పదుల సంఖ్యలో చిరుద్యోగులు ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డారు.
పొట్టకొట్టి.. రోడ్డున పడేసి
● కోవూరు నియోజకవర్గంలో తొలగించిన చిరుద్యోగుల జాబితాను చూస్తే ఎవరైనా నివ్వెరపోవాల్సిందే. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు సంబంధించి ఇందుకూరుపేట మండలంలో 14.. విడవలూరు మండలంలో ఆరు.. బుచ్చిరెడ్డిపాళెంలో నలుగురు.. కొడవలూరు, కోవూరులో ఒకర్ని చొప్పున తొలగించారు.
● పొదుపు వీఓఏలకు సంబంధించి కొడవలూరు, కోవూరులో ముగ్గురు చొప్పున, విడవలూరులో ఇద్దర్ని తొలగించి రోడ్డున పడేశారు.
● కోవూరు మండలంలో ఒక చౌక డిపో డీలర్‌ను తొలగించారు. రెక్కాడితే గానీ డొక్కాడని వీరిపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ, వికృతానందాన్ని పొందుతున్నారు.
ఆందోళన నేడు
కోవూరు నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల అరాచకాలను అడ్డుకోవాలని కోరుతూ కొడవలూరు ఎంపీడీఓ కార్యాలయ ఎదుట ధర్నాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం పది గంటలకు నిర్వహించనున్నారు. మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, నియోజకవర్గంలోని పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు.
కొడవలూరు మండలానికి చెందిన ఓ దళిత మహిళా సర్పంచ్ 15వ ఆర్థిక సంఘ నిధులతో పంచాయతీలో అభివృద్ధి పనులు చేశారు. వీటికి సంబంధించిన బిల్లులను రికార్డ్ చేసిన మండల ఇంజినీరింగ్ అధికారిణి సదరు బుక్ ఇవ్వాలంటే.. మండల షాడో ఎమ్మెల్యేను పర్సనల్‌గా కలిసి రావాలని సూచించారు. ఇలా కాకపోతే బిల్లు డబ్బులు రావని తెగేసి చెప్పారు. మహిళా అధికారే ఇలా చెప్పడంతో బిత్తరపోయిన సర్పంచ్ ఇటీవల జరిగిన మండల సమావేశంలో తన ఆవేదనను వెళ్లగక్కారు. మహిళా ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో సాటి మహిళకు ఇంతకంటే ఘోర అవమానం ఇంకొకటి ఉంటుందానని కన్నీటి పర్యంతమయ్యారు.
అవినీతి రహిత పాలనను అందిస్తానని ప్రజల ముందు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తరచూ చెప్తున్నా, నియోజకవర్గంలో అవినీతి పరవళ్లు తొక్కుతోంది. దోచుకోవడం, దాచుకోవడం తప్ప అభివృద్ధిపై ధ్యాస చూపని టీడీపీ మండల ఇన్‌చార్జీలు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులైన సర్పంచ్‌లపై పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. అధికార పార్టీ కండువా కప్పుకోకపోతే చెక్‌పవర్‌ను రద్దు చేయిస్తామంటూ బెదిరిస్తున్నారు. మాట వినకపోతే అనుకున్నది చేయిస్తున్నారు.
సర్పంచ్‌లపై కక్షపూరిత ధోరణి
పచ్చ కండువా కప్పుకోకపోతే చెక్ పవర్ రద్దు
చోద్యం చూస్తున్న కోవూరు ఎమ్మెల్యే
టీడీపీ నేతల ఆదేశాలనే
పాటిస్తున్న జిల్లా అధికారులు
విసిగివేసారి ఆందోళనకు
సిద్ధమైన వైఎస్సార్సీపీ
కొడవలూరులో నిరసన నేడు
Comments
Please login to add a commentAdd a comment