ప్రియురాలితో పెళ్లి చేయలేదనే అక్కసుతో..
● ఆమె తండ్రిని హతమార్చిన ప్రియుడు
నెల్లూరు(క్రైమ్): ప్రియురాలితో పెళ్లి చేయలేదనే కక్షతో ఆమె తండ్రిని ప్రియుడు దారుణంగా హత్య చేసిన ఘటన నగరంలోని శ్రీనివాసనగర్‌లో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు.. జాకీర్‌హుస్సేన్‌నగర్‌కు చెందిన మహబూబ్‌బాషా (54), కరిమున్నీసా దంపతులకు ఓ కుమార్తె ఉన్నారు. బిస్కెట్లు, రొట్టెలను తయారు చేసి బేకరీలకు సరఫరా చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆయన కుమార్తె, అదే ప్రాంతానికి చెందిన షాహిద్ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. దీంతో వీరికి వివాహం చేసేందుకు ఏడాది క్రితం నిశ్చితార్థం జరిపారు. అయితే షాహిద్ పనులకెళ్లకుండా స్నేహితులతో జులాయిగా తిరుగుతుండటంతో వివాహానికి మహబూబ్‌బాషా నిరాకరించారు. పెళ్లి చేయాలని షాహిద్ పలుమార్లు ప్రాధేయపడినా.. పలువురి ద్వారా ఒత్తిడి తీసుకొచ్చినా ఫలితం లేకుండాపోయింది. దీంతో కక్ష పెంచుకున్నారు. ఆయన్ను అడ్డు తొలగించుకుంటే ప్రియురాలిని వివాహం చేసుకోవచ్చని భావించారు. అప్పటి నుంచి అదను కోసం వేచిచూడసాగారు. ఈ క్రమంలో పని నిమిత్తం శ్రీనివాసనగర్‌కు మహబూబ్‌బాషా వెళ్లారు. అక్కడి నుంచి ఇంటికెళ్తుండగా షాహిద్ అడ్డుకొని, కత్తితో విచక్షణరహితంగా పొడిచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన మహబూబ్‌బాషాను చికిత్స నిమిత్తం నగరంలోని రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాలకు స్థానికులు హుటాహుటిన తరలించారు. చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతి చెందారు. సమాచారం అందుకున్న నవాబుపేట ఇన్‌స్పెక్టర్ అన్వర్‌బాషా.. హాస్పిటల్‌కు చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. కరిమున్నీసా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment