యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం
నెల్లూరు(బృందావనం): యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని హరిద్వార్‌లోని పతంజలి యోగ్ పీఠ్ సెంట్రల్ ఇన్‌చార్జి చీఫ్ పరమార్థదేవ్ మహరాజ్ పేర్కొన్నారు. నగరంలోని కస్తూరిదేవి గార్డెన్స్‌లో ఉచిత సమీకృత యోగా శిబిరాన్ని పతంజలి యోగా సమితి, భారత్ స్వాభిమాన్ ట్రస్ట్, యోగా మిత్రమండలి జిల్లా శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. మూడు రోజుల పాటు నిర్వహించనున్న కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. యోగా సాధనతో సప్తగుణాలను అధిగమించాలని చెప్పారు. దీని ద్వారా ప్రాణశక్తి శుద్ధి పొంది శరీరంలోని భాగాలన్నీ పునరుత్తేజితమవుతాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా యోగాను అందరూ సాధన చేస్తూ ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తున్నారని వివరించారు. అనంతరం శిబిరానికి హాజరైన సాధకులకు యోగాసనాలతో వాటి విశిష్టతను వివరించారు. పతంజలి యోగ్ పీఠ్ రాష్ట్ర అధ్యక్షుడు బాలోజీ యోగాచార్య, భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ జిల్లా అధ్యక్షుడు విజయకుమార్‌రెడ్డి, పతంజలి యోగా సమితి జిల్లా అధ్యక్షుడు పెంచలయ్య, అనిల్‌కుమార్, పద్మావతి, యోగా మిత్రమండలి ప్రధాన కార్యదర్శి ముత్యాల రవీంద్ర, గీతావైభవ్ ట్రస్ట్ నిర్వాహకుడు నజీర్‌బాషా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment