నాపై ఫిర్యాదు చేస్తే అట్రాసిటీ కేసు పెడతా
● చెలరేగిపోతున్న పంచాయతీ కార్యదర్శి
● అధికారులు పట్టించుకోరనే ధీమా
● హైకోర్టులో కేసు వేస్తానంటూ వీరంగం
బిట్రగుంట: బోగోలు మండలం నాగులవరం పంచాయతీ కార్యదర్శి భాస్కర్ వ్యవహార శైలి మరింత శ్రుతిమించింది. ఇంటి పన్ను కట్టేందుకు వచ్చిన వారితో రెండు రోజుల క్రితం దురుసుగా ప్రవర్తించిన వీడియోలు వైరల్ కావడం.. ఇదే అంశమై సాక్షిలో కథనం గురువారం ప్రచురితమైన విషయం విదితమే. ఇంత జరుగుతున్నా, సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో పంచాయతీ కార్యదర్శి గురువారం మరింత చెలరేగిపోయారు.
సెల్‌ఫోన్లు బయటపెట్టి రండి..!
సచివాలయానికి వచ్చే అర్జీదారులు తమ సెల్‌ఫోన్లను బయటపెట్టి రావాలని చెప్పడంతో గ్రామస్తులు అవాక్కయ్యారు. ఇంటి పన్ను వసూళ్ల కోసం అదనంగా వసూలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తూ సచివాలయం వద్దకు చేరుకోవడంతో పంచాయతీ కార్యదర్శి ఆగ్రహంతో ఊగిపోయారు. రూ.1500 కట్టించుకొని.. రూ.315కే రసీదు ఇచ్చారని గ్రామానికి చెందిన ఓ మహిళ.. ఇంటి పన్ను కట్టించుకునేందుకు రూ.ఐదు వేల లంచం అడిగారని ఓ వ్యక్తి.. వేరుశనగ మిల్లు కోసం రూ.50 వేల పన్ను కట్టించుకొని రూ.21,789కే రసీదును అందజేశారని మరో వ్యక్తి ఆరోపించారు. దీంతో కార్యదర్శి ఏకంగా బెదిరింపులకు దిగారు.
నోటికొచ్చిన సెక్షన్లు చెప్తూ.. బెదిరింపులు
లంచం తీసుకున్నానని ఆధారాలుంటే ఏసీబీకి.. కలెక్టర్‌కు చెప్పుకోండంటూ రంకెలేశారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌నని.. ఎస్సీ క్యాండిడేట్‌నని.. తనపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే అట్రాసిటీ చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్ కింద కేసు పెడతానంటూ నోటికొచ్చిన సెక్షన్ల పేర్తు చెప్తూ బెదిరింపులకు దిగారు. హైకోర్టులో ఈ రోజే పిల్ వేస్తానంటూ ఊగిపోయారు. సచివాలయం వద్ద గ్రామస్తులతో పంచాయతీ కార్యదర్శికి సుమారు గంటకుపైగా వాగ్వాదం జరిగింది. ఈ వీడియోలూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈయన మాకొద్దు..
నాగులవరం పంచాయతీ కార్యదర్శి భాస్కర్‌ను వెంటనే బదిలీ చేసి, ఆయన వ్యవహార శైలిపై విచారణ చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇంటి పన్ను కట్టించుకునేందుకు అదనంగా వసూలు చేయడం, డబ్బులివ్వని వారితో దురుసుగా ప్రవర్తిస్తుండటంతో పాటు తప్పుడు కేసులు పెడతానంటూ బెదిరింపులకు దిగుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈయన్ను మార్చకపోతే సచివాలయం ఎదుట ఆందోళనకు దిగుతామని చెప్తున్నారు. కలెక్టర్ స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment