సమాజానికి సేవ చేయాలనేదే లక్ష్యం
ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలు అందిస్తా
సాక్షితో నగర డీఎస్పీ సింధుప్రియ
కుటుంబ నేపథ్యం..
మాది తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా వీరారెడ్డిపల్లి. తండ్రి లింగారెడ్డి, తల్లి వనజాక్షి, సోదరుడు నందకుమార్‌రెడ్డి. తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. సోదరుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. భర్త కల్యాణ్ చక్రవర్తి హైకోర్టు న్యాయవాది.
విద్యాభ్యాసం..
చదువుల నిమిత్తం కుటుంబం హైదరాబాద్‌కు షిఫ్టయింది. అక్కడే నా విద్యాభ్యాసమంతా సా గింది. మౌలాలీలోని మదర్ థెరీసా హైస్కూల్లో పదో తరగతి.. నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్.. ఎమ్వీఎస్సార్ ఇంజినీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజినీరింగ్ అభ్యసించా. మాస్టర్స్ ఇన్ సోషియాలజీ చేశా.
గ్రూప్స్‌నకు ప్రేరణ ఇలా..
చిన్నతనం నుంచే క్రమశిక్షణ గల జీవన విధానాన్ని తల్లిదండ్రులు నేర్పారు. సమాజంపై అవగాహన పెంపొందించి.. తమ వంతు సేవ చేయాలని నిత్యం చెప్పేవారు. ఇదే నాలో స్ఫూర్తిని కలిగించి గ్రూప్స్ రాసేలా ప్రేరేపించింది. వివాహమయ్యాక భర్త ప్రోత్సహించారు.
లక్ష్యాన్ని మరువలేదు..
గ్రూప్స్‌నకు సన్నద్ధమవుతున్న సమయంలోనే సీడీపీఓ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 2018 సెప్టెంబర్‌లో సూర్యాపేటలో సీడీపీఓగా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించా. అనంతరం మహిళా కమిషన్‌లో పనిచేశా. మహిళలు, చిన్నారుల సంక్షేమానికి కృషి చేశా. ఉద్యోగమొచ్చిందని నా లక్ష్యాన్ని మర్చిపోలేదు.
తొలి పోస్టింగ్ నెల్లూరు..
ప్రొబేషనరీ డీఎస్పీగా తిరుపతి జిల్లాలో పనిచేశా. నెల్లూరు డీఎస్పీగా బాధ్యతలను ఈ నెల 20న స్వీకరించా. నా తొలి పోస్టింగ్ ఇది. ఎంతో ఆనందంగా ఉంది.
విధి నిర్వహణలో రాజీలేదు..
మహిళలు, చిన్నారుల భద్రతకు తొలి ప్రాధాన్యం. వారి హక్కులకు భంగం వాటిల్లకుండా చర్యలు చేపడతా. ఇక్కడి పరిస్థితులపై అవగాహన పెంచుకొని అందరి సమన్వయంతో నగర వాసులకు మెరుగైన శాంతిభద్రతలు అందిస్తా. సైబర్ నేరాలు, మత్తు, మాదకద్రవ్యాల వినియోగంతో సంభవించే దుష్పరిణామాలపై ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తా. ఫ్రెండ్లీ పోలీసింగ్ చేపట్టి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. విధి నిర్వహణలో రాజీపడే ప్రసక్తేలేదు.
24 గంటలూ అందుబాటులో..
పోలీస్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తా. 24 గంటలూ అందుబాటులో ఉంటా. ఎలాంటి సమస్యలున్నా నేరుగా నన్ను కలవొచ్చు. నేరుగా రాలేని వారు 94407 96303 నంబర్‌ను సంప్రదించొచ్చు. నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు చేపట్టే చర్యలకు ప్రజలు సహకరించాలి.
Comments
Please login to add a commentAdd a comment