..అనుకుందే అయింది..!
● రెడ్‌క్రాస్ చైర్మన్‌గా
వాకాటి విజయకుమార్‌రెడ్డి
నెల్లూరు(అర్బన్) / నెల్లూరు(బారకాసు): రెడ్‌క్రాస్‌లో మంత్రి నారాయణ రాజకీయాలు సక్సెసయ్యాయి. ముందు నుంచే అనుకుంటున్నట్లు మంత్రి సహకారంతో రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్‌గా వాకాటి విజయకుమార్‌రెడ్డిని ఎన్నుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూలురుగా ముద్రవేసి రెడ్‌క్రాస్ ఎమ్సీ మెంబర్లుగా ఉన్న ఐదుగుర్ని కలెక్టర్ ఆనంద్ ఇటీవల తొలగించారు. అంతటితో ఆగకుండా వీరి ప్రాథమిక సభ్యత్వాన్నీ రద్దు చేశారు. రెడ్‌క్రాస్ పాలకమండలిలో ఇక మిగిలిన పది మందితో చైర్మన్ ఎన్నికను కలెక్టర్ ఆదేశాలతో కలెక్టరేట్లో డీఆర్వో ఉదయభాస్కర్‌రావు గురువారం నిర్వహించారు. అయితే వీరిలో కోశాధికారిగా ఉన్న సురేష్‌కుమార్ జైన్ సమావేశానికి హాజరుకాలేదు. మిగిలిన సభ్యులు వాకాటి విజయకుమార్‌రెడ్డి, రంగయ్యనాయుడు, బయ్యా ప్రసాద్, యడవల్లి సురేష్, దాసరి రాజేంద్రప్రసాద్, గునుపాటి ప్రసాద్‌రెడ్డి, రవిప్రకాష్, కలికి శ్రీహరిరెడ్డి, చామర్తి జనార్దన్‌రాజు హాజరయ్యారు. వీరందరూ వాకాటి విజయకుమార్‌రెడ్డిని చైర్మన్‌గా, చామర్తి జనార్దన్‌రాజును వైస్ చైర్మన్‌గా ఎన్నుకున్నారు. సురేష్‌కుమార్‌జైన్‌ను కోశాధికారిగా కొనసాగించేందుకు తీర్మానించారు. ఎన్నికైన వారిని కలెక్టరేట్ ఆవరణలో పలువురు సత్కరించారు.
హాజరుకాని కలెక్టర్
ఎన్నిక జరిగే సమయంలో సమావేశానికి కలెక్టర్ హాజరుకాలేదు. విమర్శలొస్తాయనో.. లేదా ఇతర కారణమో ఎన్నిక ప్రక్రియను డీఆర్వోతో చేయించారు. ఎన్నిక అనంతరం కలెక్టరేట్‌కు వచ్చారు. ఎన్నికై న వారు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు.
సభ్యత్వ తొలగింపునకు కోర్టు చెక్
రాజకీయ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారనే కారణం చూపి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులుగా ముద్రవేసి ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డితో పాటు ఐదుగురు రెడ్‌క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులను కలెక్టర్ తొలగించారు. దీంతో వీరు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ప్రాథమిక సభ్యత్వం నుంచి వీరిని తొలగించడం కుదరదంటూ కోర్టు స్టే ఇచ్చింది. వీరిని సభ్యులుగా కొనసాగించాలని పేర్కొంది. దీంతో కలెక్టర్ నిర్ణయానికి చెక్ పడింది. కలెక్టర్‌పై ఒత్తిడి తెచ్చి ఈ రకంగా మంత్రి నారాయణ వ్యవహరించారని వారు ఆరోపించారు. కోర్టు తీర్పుతో తమకు న్యాయం జరిగిందని ఎమ్మెల్సీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment