సీఆర్పీఎఫ్ జవాన్‌కు కన్నీటి వీడ్కోలు
● అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
కలిగిరి: న్యూఢిల్లీలో గుండెపోటుతో మృతి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ లింగుంటి వెంకటనరసయ్యకు అశేష జనవాహిని కన్నీటి వీడ్కోలు పలికింది. వెంకటనరసయ్య పార్థివదేహాన్ని సీఆర్పీఎఫ్ అధికారులు ప్రత్యేక వాహనంలో తెల్లపాడుకు గురువారం తరలించారు. కార్లు, బైక్‌లతో తెల్లపాడు సత్రం నుంచి మూడు కిలోమీటర్ల వరకు గ్రామస్తులు ర్యాలీగా వెళ్లి సీఆర్పీఎఫ్ వాహనాలను తీసుకొచ్చారు. తొలుత గ్రామ సచివాలయం వద్ద ప్రజలు నివాళులర్పించారు. అనంతరం వెంకటనరసయ్య నివాసం వద్దకు చేరుకున్నారు. ప్రజల సందర్శనార్థం సుమారు గంట పాటు నరసయ్య పార్థివదేహాన్ని ఉంచారు. తెల్లపాడుతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు, పలు పార్టీల నేతలు హాజరై పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాడెను గ్రామస్తులు మోస్తూ శ్మశానానికి తీసుకెళ్లారు. అక్కడ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో సీఆర్పీఎఫ్ అధికారులు నిర్వహించారు. కలిగిరి సీఐ వెంకటనారాయణ, ఎస్సై ఉమాశంకర్ భద్రత ఏర్పాట్లు చేశారు.
ఓదార్చిన అధికారులు
వెంకటనరసయ్య మృతదేహాన్ని చూసి ఆయన భార్య యశ్విత, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. యశ్విత, కుమారులు శ్రీనికేత్, ఇస్వాంత్ పరిస్థితిని చూసి అక్కడికి వచ్చిన అందరూ చలించిపోయారు. వారిని అధికారులు, గ్రామస్తులు ఓదార్చారు.
Comments
Please login to add a commentAdd a comment