మెకానిక్ షెడ్‌లో అగ్ని ప్రమాదం
● కాలిబూడిదైన బైక్‌లు, స్పేర్‌పార్టులు ● సుమారు రూ.25 లక్షల ఆస్తి నష్టం
కొత్తూరు: మండల కేంద్రం కొత్తూరులో పైల భాస్కరరావుకు చెందిన బైక్ మెకానిక్ షెడ్ బుధవారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిబూడిదయ్యింది. ఈ ఘటనలో రిపేర్ల కోసం తీసుకొచ్చిన బైక్‌లతో పాటు సుమారు రూ.20 లక్షల విలువైన స్పేర్‌పార్ట్‌లు, కోత మిషన్లు, ఎయిర్ ట్యాంకర్, ఇతర వస్తువులు దగ్ధమయ్యాయి. సుమారు రూ.25 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపారు. మంటలు చెలిరేగిన సమయంలో అటువైపుగా వెళ్తు న్న వ్యక్తులు గుర్తించి భాస్కరరావుకు ఫోన్ ద్వారా విషయం తెలియజేశారు. ఆయన ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. వెంటనే సిబ్బంది చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే బైకులు, వస్తువులు కాలిబూడిదయ్యాయి. అప్పులు చేసి స్పేర్ పార్టులు, కోత మిషన్లు అమ్మకానికి తెచ్చానని, ఇప్పుడన్నీ కాలిపోయాయని బాధితుడు విలపించాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియలేదు.
Comments
Please login to add a commentAdd a comment