వేతనాలు పెంచాలని డిమాండ్
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): అంగన్‌వాడీల వేతనాలు పెంచాలని, 42 రోజుల సమ్మె ఒప్పందంలో అంగీకరించిన అంశాలు అమలు చేయాలని, మిని సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ – హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.కల్యాణి, డి.సుధ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ – హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) జిల్లా సమావేశాన్ని సీఐటీయూ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ అమలు చేయాలని, అంగన్‌వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీలపై యాప్‌ల భారం తగ్గించాలని పేర్కొన్నారు. సెంటర్ నిర్వహణకు ఇవ్వాల్సిన బిల్లులు, అద్దెలు ప్రతినెలా చెల్లించాలని కోరారు. కూటమి అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి, నేటికి కనీసం ఆ దిశగా ఆలోచన చేయకపోవడం దారుణమన్నారు. సర్వీసులో ఉండి చనిపోయిన వారికి దహన సంస్కార ఖర్చులకు రూ.20 వేలు, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న 164 సూపర్‌వైజర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని కోరారు. అదేవిధంగా వేతనంతో కూడిన మెడికల్ లీవ్ కనీసం 3 నెలలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ – హెల్పర్స్ యూనియన్ జిల్లా నాయకులు పి.లత, కె.సుజాత, వి.హేమలత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment