కూటమి పాలనలో కక్షసాధింపులు
టెక్కలి: సంతబొమ్మాళి మండలం నౌపడలో శుక్రవారం జరిగిన పంచాయతీ సమావేశంలో టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడి టెక్కలి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంతబొమ్మాళి మండలం నౌపడ–2 ఎంపీటీసీ సభ్యుడు బచ్చల సుధాకర్‌ను వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్ పరామర్శించారు. దాడికి గల కారణాలను తెలుసుకున్నారు. అనంతరం తిలక్ మాట్లాడుతూ ఆరు నెలల కూటమి పాలనలో ఘోరంగా వైఫల్యం చెందారని, దీనిపై ప్రజల తరఫున నిలదీస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయడం తగదన్నారు. టెక్కలి నియోజకవర్గంలో పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు అండతో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన పోలీస్, రెవెన్యూ అధికారులు సైతం ప్రజలకు రక్షణ కల్పించకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ఈ విషయంలో అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఇటీవల కోటబొమ్మాళి మండలం యలమంచిలి పంచాయతీ మామిడివానిపేటలో ఓ నిరుపేద కుటుంబానికి చెందిన ఇంటి పునాదులు కక్ష సాధింపుగానే కూల్చివేసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో అధికారులు అన్ని రకాల నిబంధనలతో లబ్ధిదారులకు ఇంటి స్థలం ఇచ్చారని, ఇప్పుడు జియోట్యాగింగ్ నెపంతో పునాదులు కూల్చేవేసే కుట్రపై టీడీపీ నాయకుల ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. సంతబొమ్మాళి మండలం ఉమిలాడలో జగనన్న లేఅవుట్‌ను టీడీపీ కార్యకర్తలు ఆక్రమించే ప్రయత్నాన్ని అధికారులు ఎందుకు అడ్డకోవడం లేదని తిలక్ ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తల చెప్పు చేతల్లో కీలుబొమ్మలుగా మారి ఇబ్బందులు పడవద్దని అధికారులకు హితవు పలికారు. టీడీపీ నాయల కక్ష సాధింపు చర్యలకు బలైపోతున్న ప్రతిఒక్కరికీ అండగా పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తిలక్ భరోసానిచ్చారు. కార్యక్రమంలో నందిగాం ఎంపీపీ ఎన్.శ్రీరామ్ముర్తి, సర్పంచ్ ఆర్.జయమోహన్, నాయకులు ఎ.రాహుల్ పాల్గొన్నారు.
దాడికి గురైన ఎంపీటీసీని
పరామర్శించిన తిలక్
అండగా ఉంటామని భరోసా
Comments
Please login to add a commentAdd a comment