ఆచారాలకు సత్కారం
సంచారం
ఇటీవల జరిగిన సమావేశంలో వలయాకారంలో కూర్చున్న కుల పెద్దలు
● విభిన్న జీవన శైలి వీరి సొంతం
● పెద్దల మాటే వేదవాక్కు
● ఏడాదికి ఒకసారి సమావేశం
● అనాదిగా సంప్రదాయాలు పాటిస్తున్న సంచార జాతులు
జలుమూరు:
వారికి ఓ శాశ్వత చిరునామా అంటూ ఉండదు. తిరిగే ఊళ్లన్నీ వారివే. ఊరువాడా తిరుగుతూ బతుకుతుంటారు. చిన్న చిన్న ఆటవస్తువులు,బొమ్మలు విక్రయిస్తూ కొందరు, అనాదిగా వస్తున్న వైద్య చిట్కాలతో తయారు చేసిన ఔషధాలు అమ్ముకుంటూ మరి కొందరు, గంగిరెడ్లును ఊరూరా తిప్పుతూ ఇంకొందరూ జీవిస్తారు. కానీ వీరు పాటించే నియమనిబంధనలు తెలిస్తే ఆశ్చర్యం కలగకమానదు. చెట్టుకో పుట్టగా తిరిగినా తాతముత్తాతలు ఏర్పరిచిన నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తారు.
మద్యం తాగి వస్తే జరిమానా..
ఈ సమావేశాలకు హాజరయ్యేవారు కొన్ని నియమాలు పాటించడం తప్పనిసరి. ముఖ్యంగా మద్యం సేవించి వస్తే సమావేశ పెద్ద అక్కడికక్కడే మూడు వందల నుంచి ఐదు వందల వరకు తప్పు తీవ్రతను బట్టి జరిమానా వేస్తారు. సమావేశ ప్రాంగణానికి, ఆవరణలోకి చెప్పులతో రావడం కూడా నిషేధం. సమావేశానికి హాజరయ్యే సంఖ్యను బట్టి వలయాకారం, బంతి భోజన ఆకారంలో కూర్చునే సమావేశ పెద్ద చెప్పే మాట లను శ్రద్ధగా వినాలి. వారి ఆజ్ఞలను శిరసా వహించాలి, ఆచరించాలి. తప్పు చేసిన వారిపై వాదోపవాదాలు జరుగుతుంటాయి. అన్ని వాదనలు విన్న తర్వాత సమావేశ పెద్ద (ఆ కులం పెద్ద) తీర్పు చెబుతాడు. అక్కడికక్కడే జరిమానా విధించి శిక్షను ఖరారు చేస్తారు.
ఎన్నెన్నో సంప్రదాయాలు..
ఈ సంచార జాతుల వారు అనాదిగా వస్తున్న తమ సంప్రదాయాన్ని తూ.చా తప్పకుండా పాటిస్తారు. కట్న కానుకలు పైసా తీసుకోకుండా, ఇవ్వకుండా వివాహాలు చేసుకోవడం వీరి సంప్రదాయాల్లో ఒకటి. ఈ జాతుల్లో వేరే జాతి వారిని పెళ్లి చేసుకున్నా ఆ జంటను శాశ్వతంగా తమ నుంచి బహిష్కరిస్తారు. వడ్డీ వ్యాపారం చేయడం వీరి దృష్టిలో పెద్ద నేరం. అప్పు చేసి తీర్చని పక్షంలో సదరు విషయం వారి దృష్టికి వచ్చి నిజమని తెలిస్తే.. తీసుకున్న డబ్బులకు రెండింతలు వసూలు చేసి కుల పెద్దలే ఆ అప్పు తీరుస్తారు. న్యాయస్థానాలు, పోలీస్‌స్టేషన్లకు వీరు వెళ్లే పనే లేదు. ఒక వేళ వెళ్లినా వీరి దృష్టిలో పెద్ద తప్పు. ఎంతటి వివాదమైనా తమ మధ్య పరిష్కరించుకుంటారే తప్ప కోర్టులకు వెళ్లరు. కుల పెద్దలు ఇచ్చే తీర్పును వేదవాక్కుగా భావించి శిరసావహించడం గమనార్హం.
ఒక్కో తప్పునకు ఒక్కో ముడి..
ఏటా క్రమం తప్పకుండా ఒక సమావేశం నిర్వహించుకోవడం వీరికి తప్పనిసరి. ఆ సమావేశాల్లో ఆయా కుటుంబాల్లో తప్పు చేసిన వారికి జరిమానా రూపంలో శిక్షలు కూడా విధిస్తారు. ఈ తప్పులు నిర్ణయించడానికి ‘దవళ’ వస్త్రాన్ని ఈ కుల పెద్దలు వినియోగిస్తుంటారు. ఒక్కో తప్పునకు ఒక్కో ముడి వెయ్యిడం ద్వారా తప్పుల సంఖ్యను నిర్ణయించి తదనుగుణంగా తీర్పునిస్తారు. జిల్లాలోని చెంచులు, గంగిరెడ్లు, జంగాలు, మల్లికార్జునులు, హరిదాసులు, మఠియాలు ఇతర సంచార తెగలకు చెందిన సనాతన సంప్రదాయమిది. ఈ ఏడాది ఈ సమావేశాలను జలుమూరు మండలం తిలారు జంక్షన్, చిన్నదూగాం గ్రామాల మధ్య ఓ మామిడి తోటలో ఇటీవలే నిర్వహించారు.
ఏటా జనవరిలో నిర్వహిస్తాం..
ప్రతి ఏడాది జనవరి నెలలో ఈ సమావేశాలు నిర్వహిస్తాం. సుమారు పది తెగల వారం ఇందులో వందల సంఖ్యలో పా ల్గొంటాం. గడిచిన ఏడాది వివాదాలు, మా సంప్రదాయాలు, ఆచారాలు ఈ సమావేశంలో చర్చించి పరిష్కరించుకుంటాం. ప్రధానంగా కుల వివాహాలను గౌరవించి మా జాతుల వారినే వివాహం చేసుకుంటాము. అలాగే ఒక్కో సమావేశం ఒక్కో చోట నిర్వహిస్తాం.
– నరసింహ,
టెక్కలి సంచార జాతి కుల పెద్ద
పెద్దల సమక్షంలో సమస్య పరిష్కారం
మా తెగలో ఏదైనా వివాదాలు జరిగితే మా కు ల పెద్దల సమక్షంలో పరిష్కరించుకుంటాం. మాట వరుసకైనా పోలీస్‌స్టేషన్, కోర్టులకు వెళ్లాం. ఎంతటి సమస్య అయినా మాలో మేము పరిష్కారం చేసుకుంటాము.
– పి.అప్పన్న, గండిరెడ్లు కుల పెద్ద, చిన్నదూగాం
Comments
Please login to add a commentAdd a comment