శ్రీకాకుళం న్యూకాలనీ: ప్రభుత్వ జూనియర్ కళాశాలల లెక్చరర్ల సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 22న ‘చలో విజయవాడ’ పేరిట చేపడుతున్న ‘న్యాయ సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయా లని డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ), ప్రభుత్వ జూనియర్ కళాశాలల లెక్చరర్ల అసోసియేషన్ రాష్ట్ర నాయకులు డాక్టర్ కె.గురవయ్య, బి.రవికుమార్, డి.మురళీధర్, ఒ.నాగసురేష్, జిల్లా ము ఖ్య ప్రతినిధులు దన్నాన ఫల్గుణరావు, గణపతి వెంకటేశ్వరరావు, ఎస్.అన్నపూర్ణారావు, బర్రి గోవిందరావు కోరారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 1998లో ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో పనిచేస్తున్న అనుభవజ్ఞులైన టీచర్లకు ప్రమోషన్ ద్వారా ఉద్యోగోన్నతి కల్పించి జూనియర్ లెక్చరర్లుగా నియమించారని, అప్పటి నుంచి జీవో 302 ప్రకారం ఉమ్మడి సీనియారిటీ ప్రాతిపదికన ప్రిన్సిపాల్స్‌గా, డిగ్రీ కళాశాలల అధ్యాపకులుగా ఉద్యోగోన్నతి కల్పించారని చెప్పారు. 2024 మార్చి 16న డీపీసీ అధ్యాపకులను పక్కనపెట్టి సర్వీస్ రూల్స్‌కు వ్యతిరేకంగా అనర్హులకు ఉద్యోగోన్నతులు కల్పించారని పేర్కొన్నారు. అన్యాయాన్ని సరిదిద్ది అక్రమ ఉద్యోగోన్నతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దృష్టికి సమస్య తీసుకెళ్లేందుకు ఈ నెల 22న విజయవాడలోని ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ కమిషనరేట్ కార్యాలయం ఎదటు న్యాయ సత్యాగ్రహ దీక్ష చేపడుతున్నట్టు తెలిపారు. శాంతియుత మార్గంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న ఈ చలో విజయవాడ కార్యక్రమానికి జూనియర్ లెక్చరర్లు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment