3.90 లక్షల మెట్రిక్ టన్నులే కొనుగోళ్లు..
● ఆగిపోయిన ధాన్యం కొనుగోళ్లు
● టార్గెట్లు అయిపోయాయంటున్న కొనుగోలు కేంద్రాల సిబ్బంది
● పొలాల్లో, ఇళ్ల లోగిళ్లలో వందలాది బస్తాలు
● లబోదిబోమంటున్న రైతులు
పొలాల్లో ఉంచలేకపోతున్నాం..
కోతలు చేసిన వెంటనే నూర్పులు చేయడానికి వీలు కాలేదు. పండగ ముందు నూర్పులు చేశాం. ధాన్యం అమ్మకాలకు కొనుగోలు కేంద్రాలకు వెళ్తే టార్గెట్లు అయిపోయాయని అంటున్నారు. రోజూ వెళ్తున్నాం. అయినా ప్రయోజనం లేదు. నా వద్దే 350 బస్తాలు ఉన్నాయి. ఇంట్లో నిల్వకు సదుపాయాలు లేవు. పొలాల్లో ఉంచుదామంటే రబీ వరికి రైతులు నీరు పెడుతున్నారు. ఈ నీరు సమీప పొలాల్లోనికి రావడంతో పొలాల్లో ఉన్న ధాన్యం తడిచి పోతున్నాయి. నానా అవస్థలు పడుతున్నాం.
– డోల గోవిందరావు, బాడాం
పది రోజులుగా కొనుగోళ్లు లేవు
ధాన్యం కొనుగోలు చేసి పది రోజులు దాటుతోంది. ఇంకెన్నాళ్లు ఓపిక పట్టాలి. టార్గెట్ల పేరుతో రైతులను వేధించడం ఎంత వరకూ న్యాయం. ఇప్పటికే బస్తాకు రూ. 300 తక్కువకు చాలా వరకూ అమ్ముకున్నాం. ఉన్న ధాన్యం మద్దతు ధరకు అమ్ముకొని కొంత లాభ పడుదామంటే ఈ విధంగా టార్గెట్ల నేరుతో కాలక్షేపం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలి.
– కింతలి చలపతిరావు, దాసరివానిపేట
నరసన్నపేట: అన్నదాతల అవస్థలు కొనసాగుతూ నే ఉన్నాయి. ఇస్తామన్న సాయం ఇవ్వక ప్రభుత్వం మోసం చేయడంతో అప్పు చేసి మరీ చాలా మంది సాగు ప్రారంభించారు. అనేక కష్టనష్టాలకు ఓర్చి పంట పండించారు. పండిన పంటను అమ్ముకుందామంటే ఇప్పటికీ ఇబ్బంది తప్పడం లేదు. మొదట్లో కొనుగోలు కేంద్రాలు సకాలంలో ప్రారంభం కాక చాలా మంది రైతులు తక్కువ ధరలకు ఇతర జిల్లాల మిల్లర్లకు పంటను విక్రయించారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన తర్వాత కొంత వరకూ ఇబ్బందులు తొలగినా తర్వాత వాతావర ణం అనుకూలించక పోవడంతో సకాలంలో నూర్పులు చేయలేక పోయారు. ఇప్పుడు వాతావరణం అనుకూలంగా ఉంది. ధాన్యంలో తేమ శాతం నిబంధనలకు వీలుగా ఉంది. పొలాల్లో తోవలు ఏర్పడటంతో రైతులు నూర్పులు చేశారు. అయితే ధాన్యం మాత్రం కళ్లాల్లో, రైతుల ఇళ్లల్లో, పొలాల్లోనే ఉండిపోతోంది. ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు కొనుగోలు కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం ఉండడం లేదు. ‘టార్గెట్లు అయిపోయాయి’ మరి కొనలేం అని సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. దీంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు. పొలాల్లో ఉంచితే నీరు వచ్చి తడిచి పోతున్నాయి, ఎలుకలు తినేస్తున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.
నరసన్నపేట మండలంలో ఉర్లాం రైల్వే ట్రాక్ దాటి ఏ గ్రామం వెళ్లినా ధాన్యం నిల్వలు కనిపిస్తున్నాయి. రైతులు కంటతడి పెడుతున్నారు. ఇదే పరిస్థితి జలుమూరు, సారవకోట, పోలాకి మండ లాల్లో ఉంది. 10 రోజులుగా ధాన్యం కొనుగోళ్లు నిలిచి పోయాయి. దీనికి ప్రధాన కారణం టార్గెట్లు అయిపోవడమే. ముందుగానే ఈ పరిస్థితి ఊహించి టార్గెట్లు పెంచితే రైతులకు ఈ ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు టార్గెట్ల పేరుతో రైతులను వేధిస్తున్నారు. వ్యవసాయ మంత్రి సొంత జిల్లాలోనే అధికారులు పట్టించుకోకుంటే ఎలా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. టార్గెట్లు పెంచాలని మండల స్థాయి అధికారులు జిల్లా అధికారులకు తెలియజేస్తున్నా పట్టించుకోవడంలేదు.
జీపీఎస్‌తో కొత్త సమస్యలు
ప్రస్తుతం రైతులు మిల్లులకు ధాన్యం పంపే వాహనాలకు జీపీఎస్ అమలు చేస్తున్నారు. జనవరి ముందు వారం వరకూ జీపీఎస్ లేదు. ఇప్పుడు అమలు చేయడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ధాన్యంతో వెళ్లిన వాహనాలు మిల్లరు లాగిన్‌లో చూపడం లేదు. దీంతో టార్గెట్లు ఉన్న మండలాల్లో కూడా ధాన్యం కొనుగోళ్లు ఆశాజనకంగా లేవు. మి ల్లులకు ధాన్యం పంపినా డబ్బులు రావడం లేదు. దీంతో రైతులు అవస్థలు పడుతున్నారు. ఈ సీజన్‌కు జీపీఎస్ విధానం రద్దు చేయాలని రైతులు కోరుతున్నారు. అలాగే జీపీఎస్ పెట్టేందుకు అయ్యే ఖర్చును వాహనదారులే పెట్టుకోవాలని అధికారులు అంటుడంతో వాహనదారులు వ్యతిరేకిస్తున్నారు. గతంలో వాహనాలకు ఉచితంగానే జీపీఎస్‌ను అధికారులు బిగించే వారు. ప్రస్తుతం సమస్యలు దృష్ట్యా జీపీఎస్ విధానం రద్దు చేయాలని రైతులు కోరుతున్నారు.
గ్రామాల్లోనే ధాన్యం
నరసన్నపేట, పోలాకి, జలుమూరు మండలాల్లో ధాన్యం నిల్వలు గుట్టలుగుట్టలుగా ఉన్నాయి. నరసన్నపేట మండలం బాడాంలో 1180 వరకూ ధాన్యం బస్తాలు ఉన్నాయి. అలాగే ముద్దాడపేటలో వెయ్యికి పైగా ఉన్నాయి. ఇలా సుందరాపురం, దాసరివానిపే ట, రావులవలస, పోతయ్యవలస, చెన్నాపురం, బడ్డ వానిపేట,నడగాం, లుకలాం, కామేశ్వరిపేట, యార బాడు, నర్శింగపల్లి, కంబకాయ తదితర గ్రామాల్లో ధాన్యం నిల్వలు అధికంగా ఉన్నాయి.
జిల్లాలో 3,60,225 ఎకరాల్లో వరి పండించారు. ఎకరాకు 33 బస్తాలు చొప్పున కొనుగోళ్లు చేస్తున్నారు. ఇప్పటి వరకూ 3,90,273 మెట్రిక్ టన్నులే కొనుగోలు చేశారు. వాస్తవానికి జిల్లాకు 4.90 లక్షల మెట్రిక్ టన్నులు టార్గెట్‌గా నిర్ధారించారు. శనివారం సరికి 3,90,273 మెట్రిక్ టన్నులు కొనుగోళ్లు చేశారు. సుమారుగా మరో లక్ష టన్నులు కొనుగోళ్లు చేయాల్సి ఉండగా సిబ్బంది చేయడం లేదు. మండలాలకు, సచివాలయాలకు ఇచ్చిన టార్గెట్లు అయిపోయాయి.. మేమేమీ చేయలేం అని సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. దీంతో రైతులు కంట తడి పెడుతున్నారు. జిల్లాలో 8.17 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. దీని ప్రకారం టార్గెట్లు పెంచి ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment