21న విశ్రాంత వ్యవసాయ విస్తరణ అధికారుల ఆత్మీయ సమావేశం
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా విశ్రాంత వ్యవసాయ విస్తరణాధికారుల ఆత్మీయ సమావేశం ఈ నెల 21న 11 గంటలకు ఇల్లీసుపురంలోని ప్రభుత్వ పింఛన్‌దారుల సంఘ భవనంలో నిర్వహించేందుకు నిర్ణయించినట్లు సంఘం అధ్యక్షుడు కుంచాల ఆదినారాయణ తెలిపారు. ఈ సందర్భంగా సంఘ సమావేశం ఆదివారం జరిగింది. ఈ ఆత్మీయ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ విస్తరణాధికారుల సంఘ పూర్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పాపినాయుడు వస్తున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాల కోసం 9542023405, 8179966304 నంబర్లను సంప్రదించాలని కోరారు. సమావేశంలో నిర్వా హక సభ్యులు కె.తవిటయ్య, డి.నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
బ్యూటీపార్లర్ నిర్వహణపై 30 రోజుల శిక్షణ
ఎచ్చెర్ల క్యాంపస్: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని 19 నుంచి 45 ఏళ్లు గల 10వ తరగతి విద్యార్హత గల మహిళలకు ఎచ్చెర్లలోని యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో ఉచిత బ్యూటీపార్లర్ నిర్వహణపై 30 రోజుల శిక్షణ నిర్వహించనున్నట్లు డైరెక్టర్ కె.శ్రీనివాసరావు అదివారం ప్రకటనలో తెలిపారు. 20వ తేదీ నుంచి శిక్షణ ప్రారంభమవుతుందని, ఆసక్తి ఉన్న వారు 7993340407, 95534 10809 నంబర్లను సంప్రదించాలని అన్నారు. శిక్షణ కాలంలో వసతి, భోజనం సౌకర్యాలు ఉచితంగా కల్పించనున్నట్లు చెప్పారు.
‘తిరుమల ఘటనలకు
ప్రభుత్వానిదే బాధ్యత’
ఇచ్ఛాపురం రూరల్: కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో వరుసగా అపచారాలు జరుగుతున్నాయని ఎమ్మెల్సీ నర్తు రామారావు విమర్శించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైకుంఠ ద్వార దర్శనాల దుర్ఘటన, ఇటీవల యాత్రిక సదన్ పైనుంచి పడి మూడేళ్ల బాలుడు మృతి, తర్వాత లడ్డూ కౌంటర్‌లో షా ర్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం, రెండో ఘాట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం, ఇప్పుడు ఎగ్ బిర్యానీ వంటి వరుస ఘటనలు తిరుమలలో జరగడం అపవిత్రమని, అందుకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. తిరుమల పవిత్రతను కాపాడుదామంటూ చెప్పిన కూటమి నాయకులు ఇప్పుడు భక్తులకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. పద్మావతి పార్కులో జరిగిన ప్రమాదంలో ఆరుగురు మృతి చెందితే ఆ కుటుంబాలకు కోటి రూపాయలు ఇవ్వాల్సిన టీటీడీ రూ.25లక్షలు చొప్పున ఇచ్చి చేతులు దులుపుకుందని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం, టీడీడీ తిరుమల పవిత్రతను కాపాడాలని కోరారు.
ఉపాధ్యాయ పండితుల సమస్యల పరిష్కారానికి కృషి
శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రంలో ఉపాధ్యాయ పండితుల సమస్యలు పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటామని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గాదె శ్రీనివాసులనాయుడు అన్నారు. రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్(రుప్ప్) ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల సంయుక్త సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయ పండిత పరిషత్ ప్రతినిధులు తమ ఆకాంక్షలు, అభిప్రాయాలను వెల్లడించారు. గాదెకు సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నట్టు రుప్ప్ సంఘ ప్రతినిధులు స్పష్టంచేశారు. కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా రుప్ప్ అధ్యక్షలు పి.రంగన్న, ప్రధాన కార్యదర్శి సోయ నాగేశ్వరరావు, గండేపల్లి మల్లేశు, కె.పద్మావతి, సూర్యారావు, వి.రమణమూర్తి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నీటి కోసం నిరసన
హిరమండలం: మేజర్ పంచాయతీ హిరమండలం చిన్నకోరాడలో తాగునీటికి స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో వీధిలోని పలు వురు మహిళలు ఆదివారం నిరసన వ్యక్తం చేశా రు. జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయిల ద్వారా తాగునీటి సరఫరా చేసేందుకు నవంబర్‌లో పనులు చేపట్టారని, అప్పటి నుంచి తమకు తాగునీటి సరఫరా ఆపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment