చేతివాటం
పంచాయతీ ఉద్యోగి
● సొంత జేబులోకి ట్రేడ్ లైసెన్స్ ఫీజు డబ్బులు
● మరి కొంత మంది నుంచి ఇంటి పన్ను పేరు మార్పుల కోసం డబ్బులు వసూళ్లు
● నాలుగు నెలలుగా విధులకు డుమ్మా
టెక్కలి: టెక్కలి మేజర్ పంచాయతీకి చెందిన ఉద్యోగి ఒకరు తన చేతివాటాన్ని ప్రదర్శించి ట్రేడ్ లైసెన్స్‌కు వసూలు చేసిన ఫీజు డబ్బులను సొంత జేబులోకి వేసుకున్నాడు. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం నిందితుడు నాలుగు నెలలుగా విధులకు డుమ్మా కొట్టడం మరింత చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే...టెక్కలి మేజర్ పంచాయతీలో కారుణ్య నియామకంలో భాగంగా హేమంత్ అనే యువకుడు స్వీపర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆ యువకుడు కాస్త చదువుకోవడంతో, పంచాయతీకి సంబందించి ట్రేడ్ లైసెన్స్ వసూళ్ల బాధ్యతలను అప్పగించారు. దీంతో అతడు ట్రేడ్ లైసె న్స్ ఫీజులను వసూలు చేసి సొంత అవసరాలకు వినియోగించుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పంచాయతీ అధికారులు మందలించి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. సొంత అవసరాలకు వినియోగించుకున్న సొమ్మును తక్షణమే పంచాయతీకి చెల్లించాలని అధికారులు ఆదేశించి కొంత గడువును ఇచ్చారు. అయినప్పటికీ పంచాయతీకి చెల్లించాల్సిన డబ్బులు చెల్లించకపోగా అక్టోబర్ నెల నుంచి నేటి వరకు విధులకు హాజరు కాకపోవడం ప్రస్తుతం పంచాయ తీ కార్యాలయంలో చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉండగా ట్రేడ్ లైసెన్స్ వసూలు చేస్తున్న హేమంత్‌కు తమ ఇంటి పన్ను పేరు మార్పుల కోసం డబ్బులు ఇచ్చా మని ఆయన ఆచూకీ లేదంటూ కొంత మంది పంచాయతీకి చెందిన ప్రజలు తరచూ అధికారు లకు ఫిర్యాదులు చేస్తున్నారు. పంచాయతీ సిబ్బంది హేమంత్ వ్యవహారంపై ఇప్పటికే జిల్లా స్థాయి పంచాయతీ అధికారులతో పాటు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఈఓ జగన్నాథం వెల్లడించారు. ఇదిలా ఉండగా గతంలో పంచాయతీ ఇంటి పన్నుల వసూళ్లు విషయంలో కొంత మంది సిబ్బంది ఇదే మాదిరిగా లక్షల రూపాయలు గోల్ మాల్ చేశారు. మళ్లీ ఇప్పుడు అదే సీన్ రిపీట్‌గా మారింది. తాజాగా జరిగిన వ్యవహారంపై కొంత మంది వార్డు సభ్యులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment