సేవ చేయడంలో పోలీస్ శాఖ ముందంజ
సూర్యాపేటటౌన్ : ప్రజలకు సేవ చేయడంలో పోలీస్ శాఖ ముందంజలో ఉంటుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట పట్టణంలో నూతనంగా నిర్మించిన డీఎస్పీ కార్యాలయాన్ని ఐజీలు రమేష్ , సత్యనారాయణ, కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్, ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలుతో కలిసి సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రూ.70 లక్షలు పోలీస్ హౌజింగ్ శాఖ నుంచి, రూ.20 లక్షలు పంచాయతీ రాజ్ శాఖ నుంచి ఈ కార్యాలయానికి నిధులు సమకూర్చినట్లు తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతలు కాపాడే విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయాలని సూచించారు. దేశంలోనే తెలంగాణ పోలీస్ ప్రథమ స్థానంలో ఉందని, రాష్ట్రంలో పోలీస్ శాఖకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేయడానికి కృషి చేస్తానన్నారు. సూర్యాపేట జిల్లాలో కొత్తగా ఏర్పడిన అనంతగిరి, చింతలపాలెం, పాలకవీడు, మద్దిరాల, నాగారం పోలీస్ స్టేషన్లకు నూతన భవనాలకు నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. నూతన కార్యాలయంలో డీఎస్పీ రవిని కుర్చీలో కూర్చోబెట్టి పుష్పగుచ్ఛం అందజేసి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ లు నాగేశ్వరరావు, జనార్దన్ రెడ్డి, డీఎస్పీలు రవి, శ్రీధర్ రెడ్డి, సూర్యాపేట పబ్లిక్ క్లబ్ చైర్మన్ వేణారెడ్డి, జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర నాయకుడు చలసాని శ్రీనివాసరావు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయాలి
పేటలో డీఎస్పీ కార్యాలయాన్ని
ప్రారంభించిన మంత్రి ఉత్తమ్
Comments
Please login to add a commentAdd a comment