సర్వేకు ఆపసోపాలు
సమగ్ర కుటుంబ సర్వేలో ఎన్యుమరేటర్ల పాట్లు
భానుపురి (సూర్యాపేట) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వేలో వివరాల సేకరణకు ఎన్యుమరేటర్లు ఆపసోపాలు పాడాల్సివస్తోంది. మొత్తం 75 ప్రశ్నలకు సమాధానాలు రాబట్టి ఫారంలో నింపాల్సి ఉంది. కానీ, తమకు అందుతున్న పథకాలు ఎక్కడ రద్దవుతాయోనన్న అనుమానంతో జనం సరైన సమాధానాలు చెప్పడం లేదు. దీనికితోడు ఎన్యుమరేటర్లు సర్వేకు మధ్యాహ్నం వెళ్తుండడంతో అప్పటికే ప్రజలు వ్యవసాయ, ఇతర పనులకు పోవడంతో ఇళ్లకు తాళాలు ఉంటున్నాయి. దీంతో ఒక్కో ఇంటికి రెండు, మూడుసార్లు తిరగాల్సి వస్తోందని ఎన్యుమరేటర్లు చెబుతున్నారు.
మీకెందుకు వివరాలివ్వాలి..
సర్వేలో మొత్తం 75 అంశాలపై వివరాలు సేకరించాల్సి ఉంది. ఇలా ఒక్కో కుటుంబానికి దాదాపు గంట సమయం పడుతుందని ఎన్యుమరేటర్లు ఆవేదన చెందుతున్నారు. చాలా గ్రామాల్లో ప్రజలు ఎన్యుమరేటర్లను నిలదీస్తున్నారు. ‘మాకేమైనా పథకాలు ఇస్తారా... మీకెందుకు వివరాలు చెప్పాలని’ ఎదురు ప్రశ్నిస్తున్నారు. ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లు, కార్లు కనిపిస్తున్నా.. అవి తమవి కాదంటూ దాటవేస్తున్నారు. ఇలా చాలా చోట్ల సర్వే సాఫీగా సాగని పరిస్థితి నెలకొంది. 51వ కాలంలో స్థిరాస్తుల వివరాలు చెప్పడం లేదు. 52వ కాలంలో టీవీ, రిఫ్రిజ్‌రేటర్, ద్విచక్ర వాహనం, కారు, వాషింగ్ మిషన్ తదితర వివరాలను వెల్లడించేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు. కొన్నిచోట్ల కులం తెలిపే క్రమంలో ఉపకులాలు చెప్పడం లేదని ఎన్యుమరేటర్లు అంటున్నారు. కొన్నిచోట్ల సొంతింట్లో ఉంటున్నా.. అద్దెఇల్లు అని సర్వేలో రాయిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజాపాలనలో చేసుకున్న దరఖాస్తులకు మోక్షం లేదని, సర్వేలో సమాధానాలు ఎందుకు చెప్పాలని నిలదీస్తున్నారు.
27వరకు పూర్తయ్యేనా?
ఈనెల 8వ తేదీన ప్రభుత్వం సమగ్ర సర్వే ప్రారంభించింది. దీన్ని ఈనెల 27వ తేదీ వరకు పూర్తి చేయాలని గడువు విధించింది. అయితే జిల్లాలో 3,69,557 ఇళ్లు ఉన్నట్లు ఎన్యుమరేటర్లు గుర్తించారు. ఇందులో ఈనెల 18వ తేదీ నాటికి 2,69,066 ఇళ్లను సర్వే చేశారు. అంటే 72.8 శాతం సర్వే పూర్తయింది. జిల్లావ్యాప్తంగా అర్బన్ ప్రాంతాల్లో 69.4 శాతం, రూరల్ ప్రాంతాల్లో 73.9 శాతం చొప్పున ప్రజల ఇళ్లకు వెళ్లి సిబ్బంది వివరాలు సేకరించారు. మరో వారం రోజుల్లో ఈ సర్వేను పూర్తి చేయాల్సి ఉండగా.. ఎన్యుమరేటర్ల ఇబ్బందుల కారణంగా సర్వే పూర్తవుతుందా ? లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రెవెన్యూ డివిజన్ల వారీగా సర్వే చేసిన శాతం
ఫ ఉదయం విధులు ముగించుకొని మధ్యాహ్నం సర్వేకు..
ఫ వ్యవసాయ, ఇతర పనులకు జనం వెళ్లడంతో ఆ సమయంలో చాలా ఇళ్లకు తాళాలు
ఫ ఒక్కో ఇంటికి రెండుమూడు సార్లు తిరగాల్సిన పరిస్థితి
ఫ ఒకవేళ ఉన్నా.. పూర్తి వివరాలు చెప్పేందుకు ఆసక్తిచూపని ప్రజలు
ఫ జిల్లాలో 72.8 శాతం సర్వే పూర్తి
సూర్యాపేట 73.8%
హుజూర్‌నగర్ 73.6%
కోదాడ 69.9%
Comments
Please login to add a commentAdd a comment