తుది దశకు కొనుగోళ్లు
భానుపురి (సూర్యాపేట): జిల్లాలో 2024–25 వానాకాలం సీజన్ వరి ధాన్యం సేకరణ తుదిదశకు చేరుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా పౌరసరఫరాల శాఖ ఇప్పటి వరకు దాదాపు 1.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించింది. ఎన్నడూలేని విధంగా ఈయేడు సన్నరకానికి ప్రభుత్వం రూ.500 బోనస్ చెల్లించింది. ఈ నేపథ్యంలో దొడ్డు, సన్నరకాల ధాన్యానికి వేర్వేరుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. దాదాపు దొడ్డురకం ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయి. సన్నరకం ధాన్యం కొనుగోళ్లు మరికొన్ని రోజుల్లో పూర్తికానున్నట్టు తెలుస్తోంది.
316 కొనుగోలు సెంటర్ల ద్వారా..
ఈ సీజన్‌లో జిల్లాలో 4.72 లక్షల ఎకరాల్లో రైతులు వరి పంటను సాగు చేశారు. సుమారు 10.22 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తోందని, ఇందులో రైతుల అవసరాలు, ప్రైవేట్ అమ్మకాలు పోగా ప్రభుత్వ కొనుగోలు సెంటర్లకు 3.71 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తోందని జిల్లా యంత్రాంగం భావించింది. ఇందులో దొడ్డురకం 2లక్షల మెట్రిక్ టన్నులు, సన్నరకం 1.71 లక్షల మెట్రిక్ టన్నులు ఉండనుందని అంచనా వేసింది. ఈ మేరకు 170 దొడ్డురకం సెంటర్లు, 146 సన్నరకం కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేసింది. ఈ సెంటర్లలో ఇప్పటికే దొడ్డురకం కొనుగోళ్లు పూర్తయ్యాయి.
33,707 మంది రైతుల నుంచి..
జిల్లాలో సన్నరకాలకు తోడుగా దొడ్డురకం వరికి సైతం మార్కెట్‌లో మంచి డిమాండ్ నెలకొంది. క్వింటాకు దొడ్డురకానికి రూ.1,950 నుంచి రూ.2వేలకు పైగా ధర పలికింది. ఇక సన్నరకాలకు రూ.2,450 నుంచి రూ.2,600 వరకు ధర పడింది. దీంతో సన్నాలతో పాటు దొడ్డురకాలను సైతం రైతులు మిల్లులు, వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో విక్రయించారు. జిల్లాలోని దొడ్డురకం సెంటర్లలో 21,133 మంది రైతుల నుంచి రూ.249 కోట్ల విలువ గల లక్ష మెట్రిక్ టన్నుల దొడ్డురకం ధాన్యాన్ని సివిల్ సప్లయ్ అధికారులు సేకరించారు. ఇక 12,574 మంది రైతుల నుంచి రూ.157 కోట్ల విలువ గల 70వేల మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యాన్ని కూడా కొనుగోలు చేశారు. మొత్తంగా రూ.406 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని 33,707 మంది రైతుల సేకరించగా.. మరో 30 నుంచి 40వేల మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం అమ్మకానికి గాను ప్రభుత్వ కొనుగోలు సెంటర్లలో సిద్ధంగా ఉంది.
త్వరలో పూర్తికానున్న సన్న ధాన్యం సేకరణ
ఫ మరో 40 మెట్రిక్ టన్నుల వరకు కొనుగోలు కేంద్రాల్లోనే నిల్వ
ఫ ఇప్పటికే దొడ్డురకం కొనుగోళ్లు పూర్తి
దొడ్డురకం 1,00,000 మెట్రిక్ టన్నులు
సేకరించిన ధాన్యం 1.70 లక్షల మెట్రిక్ టన్నులు
సన్నరకం 75 వేల మెట్రిక్ టన్నులు
సేకరించిన ధాన్యం విలువ రూ.406 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment