విద్యార్థుల కంటి సమస్యలు తీర్చేలా..
తిరుమలగిరి (తుంగతుర్తి): ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న వేలాది మంది విద్యార్థులు కంటి సమస్యలు ఎదుర్కొంటూ నానా ఇబ్బందులు పడుతున్నారు. వైద్య పరీక్షలు చేయడం ద్వారా విద్యార్థుల కంటి సమస్యలను ప్రాథమిక దశలోనే పరిష్కరించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పదకొండేళ్ల నుంచి ఆర్‌బీఎస్‌కే (రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం)ను కరోనా అనంతరం రెండేళ్ల నుంచి పక్కా అమలు చేస్తోంది. ఏటా కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులందరికీ కంటి పరీక్షలు చేయిస్తోంది.
తొమ్మిది బృందాలతో పరీక్షలు..
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు, అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆర్‌బీఎస్‌కే ద్వారా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇద్దరు వైద్యులు, ఒక ఏఎన్‌ఎం, ఒక ఫార్మసిస్టు సభ్యులుగా తొమ్మిది బృందాలు ఏర్పాటు చేసి వారంలో ఐదు రోజుల పాటు విద్యార్థుల వద్దకు వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
51,164 మందికి కంటి పరీక్షలు..
ఆర్‌బీఎస్‌కే కింద జిల్లాలో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు 51,164 మంది విద్యార్థులకు కంటి వైద్యపరీక్షలు నిర్వహించారు. ఇందులో మొత్తం 1,409 మంది విద్యార్థులు కంటికి సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నట్లు వైద్యసిబ్బంది గుర్తించారు. ఆర్‌బీఎస్‌కే ఆధ్వర్యంలో విద్యార్థులకు గత సంవత్సరం కూడా పరీక్షలు నిర్వహించి కంటిఅద్దాలు ఇచ్చారు. ఈ సంవత్సరం కూడా కంటి సమస్యలు ఉన్న విద్యార్థులను గుర్తించి, పరీక్షలు చేసి, అవసరం ఉన్న వారికి అద్దాలు అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
కంటి సమస్యలు ఉంటే అద్దాలు అందజేస్తాం
ఆర్‌బీఎస్‌కే వైద్య బృందాలు నిర్వహిస్తున్న పరీక్షల్లో ఎక్కువ శాతం మంది విద్యార్థులు కంటి సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించాం. విద్యార్థులు అధికంగా సెల్‌ఫోన్లు చూడడంతో కంటి సమస్యలు వస్తున్నాయి. కంటి సమస్యలు ఉన్న విద్యార్థులందరికీ అద్దాలు అందజేస్తాం.
– డాక్టర్ కోటాచలం, డీఎంహెచ్‌ఓ
ఫ ప్రభుత్వ స్కూళ్లు, కళాశాలల్లో ఆర్‌బీఎస్‌కే ద్వారా వైద్య పరీక్షలు
ఫ గత ఏడాది నుంచి ముమ్మరంగా
కార్యక్రమం అమలు
ఫ ప్రస్తుత విద్యా సంవత్సరంలో
51,164 మందికి పరీక్షలు
ఫ కంటి సమస్యలకు సెల్‌ఫోన్ అధిక వినియోగమే
కారణమంటున్న వైద్యులు
పరీక్షలు ఎందుకంటే..
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు వివిధ రకాల కారణాలతో సరియైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల ప్రధానంగా కంటి సమస్యలతో బాధపడుతున్నారు. మరి కొందరు సెల్‌ఫోన్లు ఎక్కువగా చూడడం వల్ల కంటి సమస్యల బారిన పడుతున్నారు. దీనివల్ల దూరపు చూపు తగ్గిపోవడంతో కొద్దిసేపు చదివిన వెంటనే తలనొప్పి రావడం, కళ్ల నుంచి నీరు కారడం లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని వైద్యులు చెబుతున్నారు. కొందరు విద్యార్థులైతే బోర్డుపై రాసే అక్షరాలు గుర్తించడానికి కూడా నానా అవస్థలు పడుతున్నారు. ఎక్కువ సేపు చదవలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో సమస్యను ఆదిలోనే గుర్తించి పరిష్కరించాలని విద్యార్థులందరికీ కంటి పరీక్షలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment