భక్తజన సంద్రంగా జాన్‌పహాడ్ దర్గా
పాలకవీడు: సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని జాన్‌పహాడ్ సైదన్న ఉర్సుకు భక్తజనం పోటెత్తారు. రెండో రోజైన శుక్రవారం గంధోత్సవం సందర్భంగా సుమారు లక్షన్నరకు పైగా భక్తులు దర్గాను దర్శించుకున్నారు. వక్ఫ్‌బోర్డు ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన పవిత్ర గంధాన్ని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పూజారి జానీ ఇంటి నుంచి ప్రత్యేకంగా అలంకరించిన అశ్వంపై మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకొచ్చి చందన్‌ఖానాలో ఉంచి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పుర వీధుల్లో ఊరేగించారు. వక్ఫ్‌బోర్డు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అలంకరించిన అశ్వంపై పవిత్ర గంధాన్ని కల్మేట్‌తండా, జాన్‌పహాడ్, చెరువుతండా గ్రామాల వీధుల్లో ఊరేగించారు. గంధం సాయంత్రం నాలుగు గంటలకు దర్గాకు చేరుకుంది. ఆ సమయంలో భక్తుల దర్శనాన్ని నిలిపివేసి గంధాన్ని దర్గాలోకి తీసుకొచ్చి సైదులుబాబా(హజరత్ సయ్యద్ జాన్‌పాక్ షాహిద్ రహ్మతుల్లా అలై, సోదరుడు సయ్యద్ మొహినుద్దీన్‌షా) సమాధులపైకి ఎక్కించి ప్రత్యేక ప్రార్థనలు, నమాజులు చేశారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు.
కృష్ణా నదిలో పుణ్యస్నానాలు..
ప్రతి పదిహేను నిమిషాలకు ఒక బస్సు చొప్పున కోదాడ, మిర్యాలగూడెం ఆర్టీసీ డిపోల నుంచి భక్తులకు రవాణా సౌకర్యం కల్పించారు. కృష్ణా నదిలో, వాటర్ ట్యాంకుల వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి దర్గాను దర్శించుకున్నారు. దర్గా సమీపంలో ఉన్న నాగుల పుట్ట వద్ద మహిళలు పాలు, పండ్లు, గుడ్లు నైవేద్యం సమర్పించారు.
పోలీసుల ప్రత్యేక క్యాంపు
భక్తుల సౌకర్యం కోసం దర్గా సమీపంలో మెడికల్, పోలీసులు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేశారు. దర్గా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం పారిశుద్ధ్య కార్మికులు పనిచేశారు. అంబులెన్సు, అగ్నిమాపక వాహనాలు, సిబ్బందిని అందుబాటులో ఉంచారు.
డెక్కన్ పరిశ్రమ సహకారం..
ఉర్సుకు డెక్కన్ పరిశ్రమ యాజమాన్యం సహకారం అందించింది. రోడ్ల మరమ్మతులు, 8 ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేశారు. 30 తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటు చేశారు.
రూ.1.50 కోట్ల వ్యయంతో దర్గా అభివృద్ధి
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉర్సుకు ముఖ్య అతిథిగా హాజరై గంధం ఊరేగింపు ప్రారంభించి సైదులుబాబాను దర్శించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. దర్గ అభివృద్ధికి రూ.1.50 కోట్లు ప్రత్యేక నిధులు కేటాయించి ఖర్చు చేశామన్నారు. వేడుకల్లో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బెల్లంకొండ విజయలక్ష్మి, మాజీ ఎంపీపీ భూక్యా గోపాల్, బుజ్జి మోతీలాల్, ఎన్‌వి.సుబ్బారావు, సప్పిడి నాగిరెడ్డి, నరసింహారావు, జితేందర్‌రెడ్డి, వెంకటి, నీమానాయక్, ముస్లిం మత పెద్దలు, దర్గా ముజావర్ జానీ తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా గంధోత్సవం
వేడుకల్లో పాల్గొన్న
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment