భువనగిరి ఖిలాకు హంగులు..
భువనగిరి : ఎన్నో పోరాటాలకు, చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది భువనగిరి ఖిలా. హైదరాబాద్ నగరానికి 47 కిలోమీటర్ల దూరంలో ఏకశిలపై నిర్మించబడిన చారిత్రక కట్టడం భువనగిరి కోట. 610 మీటర్ల ఎత్తయిన ఈ కొండ తాబేలులా, ఏనుగులా కనిపిస్తుంది. ఈ కోటను పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన 6వ త్రిభువన మల్లవ విక్రమాదిత్య పాలనలో నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. అంతటి చరిత్ర కలిగిన ఖిలా ఆధునిక హంగులను సంతరించుకోనుంది. స్వదేశీ దర్శన్ 2.0 పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూ. 118 కోట్లు ఖర్చు చేయనుండగా తొలి విడతలో రూ. 56.82 కోట్లు మంజూరయ్యాయి. తెలంగాణ రాష్ట్ర పర్యాటక సంస్థ లిమిటెడ్ ఆధ్వర్యంలో పనులకు శ్రీకారం చుట్టారు. ఇటీవల టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది.
చేపట్టనున్న పనులు ఇవీ..
ఖిలా అభివృద్ధి పనులు నాలుగు దశల్లో చేపట్టనున్నారు. పర్యాటకులను ఆకర్షించేలా రోప్‌వే ఏర్పాటు చేయనున్నారు. రోప్ వే వెంట 30 మీటర్ల వెడల్పుతో రోడ్డు, రహదారి వెంట యాక్సెస్ రోడ్డు, పార్కింగ్, ఫుట్‌పాత్, కోట ద్వారాల వద్ద భారీ ప్లాజా సైట్ అభివృద్ధి చేయనున్నారు. వీటితోపాటు అడ్మిన్ బ్లాక్, అవసరమైన చోట టాయిలెట్లు, ప్రస్తుతం ఉన్న టాయిలెట్లు పునరుద్ధరణ, ప్రవేశ ద్వారం, కాంపౌడ్ వాల్, శిల్పాలు, ఫుడ్‌కోర్టు రానున్నాయి. కొండపై కొత్త టాయిలెట్లు, ఫలహారశాల, మంచి నీటి వసతి, మెట్ల మార్గాన్ని సరిచేయనున్నారు. తొలి విడత పనులకు రూ.56.82 కోట్లు ఖర్చు చేయనన్నారు.
కట్టడాల ఆధునీకరణ
కొత్త పనులతోపాటు కోటపైన ఉన్న కట్టడాల ఆధునీకరణ పనులను చేపట్టనున్నారు. ముఖ ద్వారం వద్ద విద్యుదీకరణ, కొండపైన ఏర్పాటు చేయనున్న పార్కింగ్ వద్ద టైటింగ్, ఇంటర్ ప్రిటేషన్ సెంటర్ పై టెన్సిల్ స్ట్రక్చర్ రూప్ నిర్మాణం చేపడతారు. కోటపైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు.
పెరగనున్న పర్యాటకులు
భువనగిరి ఖిలా హైదరాబాద్–వరంగల్ ప్రధాన రహదారికి సమీపంలో ఉంది. ఇక్కడికి నిత్యం భారీ సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. విదేశీయులు కూడా ఖిలాను సందర్శిస్తారు. రాక్ క్‌లైంబింగ్ శిక్షణ స్కూల్ ఉండడం వల్ల రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి యువత, విద్యార్థులు ఇక్కడ రాక్‌క్‌లైంబింగ్‌లో శిక్షణ పొందుతారు. అలాగే జీప్‌లైన్ సైతం ఇక్కడ ఉంది. ఇప్పటికే కోట నమూనా చిత్రాలను విడుదల చేయడంతో ఆ చిత్రాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
వసతుల కల్పన, కొత్త నిర్మాణాలు, వారసత్వ కట్టడాల పునరుద్ధరణ
నాలుగు దశల్లో రూ. 118 కోట్లతో పనులు
Comments
Please login to add a commentAdd a comment