అద్భుత కళాఖండాల ఖిలా..
దేవరకొండ: వందల ఏళ్ల చరిత్ర కలిగిన దేవరకొండ ఖిలాకు ఎంతో ప్రాచుర్యం ఉంది. తెలంగాణలో ఉన్న కోటలన్నిటిలో దేవరకొండ కోట తనకంటూ ఒక ప్రత్యేకతను సొంతం చేసుకుంది. 13వ శతాబ్దంలో నిర్మితమైన దేవరకొండకు సురగిరి అనే పేరుంది. కోట గోడలు ప్రస్తుతం బీటలు వారినా.. నిర్మాణ శైలి నేటికీ అబ్బురపరుస్తుంది. పది కిలో మీటర్ల పొడవు, 500 అడుగుల ఎత్తులో ఏడుకొండల మధ్య నిర్మితమైన దేవరకొండ కోట శత్రుదుర్భేద్యంగా ఉండేది. మట్టి, రాళ్లతో కట్టిన కోట గోడలు నేటికీ నాటి నిర్మాణ శైలిని చాటుతున్నాయి. ఇక్కడి శిల్పకళా సంపద చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయి.
శిథిలావస్థకు కట్టడాలు
దేవరకొండ కోటలో పలు కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. గతంలో ఖిలాలోని శిల్పకళా సంపదను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. అంతే కాకుండా ఖిలా పైకి వెళ్లే మార్గంలో పలుచోట్ల పెద్దపెద్ద బండరాళ్లు పడిపోయాయి. గతంలో ఖిలాను పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ స్థానికులతోపాటు వివిధ పార్టీల నేతలు తమ గొంతుకను వినిపించారు. కోట సంరక్షణకు చర్యలు చేపట్టాలంటూ నినదించారు. ఇప్పటికీ పలుచోట్ల శిల్పకళా సంపద దెబ్బతిని కనిపిస్తుంది.
రూ.5కోట్లతో పార్క్ నిర్మాణం
దేవరకొండ ఖిలా ఆవరణలో రూ.5కోట్లతో పార్క్ నిర్మాణానికి గత ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇటీవల పార్క్‌ను దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ ప్రారంభించారు. పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు పార్క్ నిర్మాణం చేపట్టారు. దీంతో దేవరకొండకు మణిహారంగా ఖిలా పార్క్ నిలిచింది.
పర్యాటక ప్రాంతం చేయాలంటూ..
ఎంతో చరిత్ర కలిగిన దేవరకొండ ఖిలాను పర్యాటక ప్రాంతంగా ఏర్పాటు చేయాలనేది ఇక్కడి ప్రజల చిరకాల కోరిక. అందుకు తగ్గట్టుగా ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ దేవరకొండ ఖిలాను పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఖిలాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే దేవరకొండతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలు సైతం అభివృద్ధి చెందుతాయని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
శిథిలావస్థకు చేరిన పలు కట్టడాలు
ఇటీవల రూ.5 కోట్లతో ఖిలా
ఆవరణలో పార్క్ నిర్మాణం
Comments
Please login to add a commentAdd a comment