అద్భుతం.. బుద్ధవనం
నాగార్జునసాగర్: ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్ జలాశయ తీరంలో నిర్మించిన బుద్ధవనం మహా అద్భుతంగా ఉందని ఇండియన్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ బృందం సభ్యులు కొనియాడారు. ఢిల్లీకి చెందిన ఇండియన్ ఎయిర్‌పోర్ట్ బృందం తెలంగాణలోని కొత్తగూడెం, ఆంధ్రప్రదేశ్ పరిధిలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టు తీర ప్రాంతంలో విమానాశ్రయాలను ఏర్పాటు చేసేందుకు భూముల సర్వేకు వచ్చారు. వారం రోజులుగా విజయవిహార్‌లోనే ఉంటూ క్షేత్రస్థాయి సర్వే చేశారు. శుక్రవారం వారు బుద్ధవనాన్ని సందర్శించారు. వీరికి బుద్ధవనం ఈఓ శాసన్, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు బుద్ధుడి పాదాలకు పుష్పంజలి ఘటించారు. అనంతరం బుద్ధుడు జన్మించిన దగ్గరి నుంచి నిర్యాణం వరకు కళ్లకు కట్టినట్లు నిర్మించిన పార్కులను సందర్శించారు. బుద్ధ చరిత వనం, తపోవనం, జాతక పార్కు, స్థూప పార్కు, మహాస్థూపం తదితర ప్రాంతాలను సందర్శించారు. ధ్యాన మందిరంలో కాసేపు ధ్యానం చేశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు బుద్ధవనం గురించి వివరించారు. బుద్ధవనం చారిత్రక విశేషాలను స్థానిక గైడ్ సత్యనారాయణ తెలియజేశారు. కార్యక్రమంలో పరవింద తివారి, శిబిచక్రవర్తి, అజయ్‌కుమార్, ఏఎస్‌ఎన్ మూర్తి, ఎం.జె బాబు, డీకే మిశ్ర, ఆర్‌ఐ దండ శ్రీనివాస్‌రెడ్డి, నిరంజన్ పాల్గొన్నారు.
ఇండియన్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ బృందం
Comments
Please login to add a commentAdd a comment