క్లుప్తంగా
ఆంధ్ర నుంచి గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్టు
వేలూరు: ఆంధ్ర రాష్ట్రం నుంచి వేలూరు మీదుగా పుదుచ్చేరికి గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. జిల్లా ఎస్పీ మదివాణన్ ఆదేశాల మేరకు పోలీసులు జిల్లావ్యాప్తంగా ఉన్న సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచారు. ఆంధ్ర రాష్ట్రం నుంచి వేలూరుకు చేరుకునేందుకు మొత్తం నాలుగు చెక్ పోస్టులుండగా అన్ని ప్రాంతాల్లోనూ వాహనాల తనఖీ చేపట్టారు. ఆ సమయంలో పుదుచ్చేరి రాష్ట్రం విలియనూరు గ్రామానికి చెందిన విన్నరసన్, రామ్‌కుమార్ బైకులో గంజాయిని వేలూరు మీదుగా తరలిస్తున్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. వారి వద్ద ఉన్న గంజాయి, బైకును స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాను ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కొనుగోలు చేశారు, ఎక్కడకి తరలిస్తున్నారు అనే కోణంలో విచారణ చేస్తున్నారు.
బీజేపీ నుంచి వైదొలగిన ఇద్దరు నైల్లె నాయకులు
సేలం : బీజేపీ పార్టీ నుంచి ఇద్దరు నైల్లె నిర్వాహకులు వైదొలిగారు. ప్రస్తుతం బీజేపీ పార్టీలో అంతర్గత ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెలలోపు కొత్త రాష్ట్ర అధ్యక్షులను ప్రకటించనున్నారు. ఈ స్థితిలో నైల్లె జిల్లాలో బీజేపీ అధ్యక్షుడు దయాశంకర్ పార్టీ నుంచి తొలగిపోయారు. పలు సంవత్సరాలుగా బీజేపీలో పనిచేస్తూ వచ్చిన దయాశంకర్ అకస్మాత్తుగా పార్టీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత అదే జిల్లా బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తూ వచ్చిన వేల్ ఆర్ముగం కూడా పార్టీ నుంచి తప్పుకున్నారు. రాష్ట్ర బీజేపీ పార్టీలో ఒకే జిల్లాలో ఇద్దరు కీలక నాయకులు ఒకేసారి పార్టీ నుంచి వెళ్లిపోవడం కలకలం రేపుతోంది.
మండపం నుంచి చైన్నె ఎగ్మోర్‌కు ప్రత్యేక రైలు
కొరుక్కుపేట: పొంగల్‌కు సొంత ఊళ్లకు వెళ్లిన ప్రయాణికులు తిరిగి చైన్నెకు చేరుకునేందుకు వీలుగా రామనాథపురం జిల్లా మండపం నుంచి చైన్నె ఎగ్మోర్‌కు ప్రత్యేక రైలు ( నెంబర్ 06048) నడపనున్నట్లు సదరన్ రైల్వే వెల్లడించింది. ఆదివారం రాత్రి 10 గంటలకు మండపం నుంచి బయలుదేరి, ఆ తరువాత రోజు ఉదయం 11:30 గంటలకు చైన్నె ఎగ్మోర్ చేరుకుంటుంది. ఇందులో 3 ఏసీ క్లాస్ కోచ్‌లు, 9 స్లీపర్ కోచ్‌లు, 4 జనరల్ కోచ్‌లు ఉంటాయని , ఈరైలు రామనాథపురం , పరమక్కుడి, మన మదురై, శివగంగై, కల్లాల్, కారైకుడి, పుదుకోట్టై, తిరుచ్చి, తంజావూరు, కుంభకోణం, మైలాడుదురై, సిర్గాలి, చిదంబరం, కడలూరు, బన్రుట్టి, విల్లుపురం, దిండివనం, మేల్మరువత్తూరు, తాంబరం, చెంగల్ పట్టు స్టేషన్‌లలో ఆగుతందని అధికారులు వెల్లడించారు.
వరుస చోరీలపై విచారణ
తిరువళ్లూరు: పట్టణంలోని ప్రధాన మార్గంలో శుక్రవారం జరిగిన వరుస చోరీలు కలకలం రేపింది. వివరాలు.. తిరువళ్లూరు పట్టణంలోని లక్ష్మీపురం ప్రాంతానికి చెందిన సురేంద్రన్(39). ఇతను అదే ప్రాంతంలో ప్రోవీజినల్ దుకాణం నిర్వహిస్తున్నాడు. శుక్రవారం రాత్రి యధావిదిగా వ్యాపారం ముగిసిన తరువాత దుకాణానికి తాళం వేసుకుని ఇంటికి వెళ్లినట్టు తెలుస్తోంది. అనంతరం శనివారం ఉదయం దుకాణం వద్దకు రాగా అప్పటికే తాళం పగలగొట్టి సుమారు రూ.20 వేలు నగదు, పది వేల రూపాయల విలువ చేసే వస్తువులను ఎత్తుకెళ్లారు. దీంతో పాటు అదే ప్రాంతంలో కమల వినాయకుడి ఆలయం ఉంది. ఆలయ హుండీని పగలగొట్టిన దుండగులు అందులోని నగదును చో రీ చేశారు. ఇదే ప్రాంతంలోనే మరో రెండు దుకాణాల్లోనూ చోరీకి యత్నించారు. సమాచారం అందుకున్న తిరువళ్లూరు టౌన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితుల వద్ద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment