ప్రముఖ హోటల్ సిబ్బంది అనుచిత ప్రవర్తన
● ధర్నాకు దిగిన న్యాయవాది
తిరువళ్ళూరు: ప్రముఖ హోటల్‌లో టిఫిన్ కోసం వచ్చిన వ్యక్తిని అవహేళన చేసేలా అంత డబ్బు వుందా అంటూ హోటల్ సిబ్బంది ప్రశ్నించడంతో చిర్రెత్తిన వ్యక్తి రెండు గంటల పాటు ధర్నాకు దిగడం కలకలం రేపింది. సమాచారం అందుకుని ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు, హోటల్ మేనేజర్‌తో బహిరంగంగా సారీ చెప్పించి సమస్యను పరిష్కరించారు. వివరాలు.. తిరువళ్లూరు పట్టణంలో తిరుపతి–చైన్నె జాతీయ రహదారిలో నిత్య అమృతం పేరుతో ప్రముఖ హోటల్ వుంది. హోటల్‌కు పార్కింగ్ సదుపాయం వుండడంతో చైన్నె నుంచి తిరుపతి వెళ్లే ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. ఈ క్రమంలో హోటల్‌కు శనివారం ఉదయం తిరువేళాంగాడుకు చెందిన విష్ణువర్ణన్ అనే న్యాయ వాది టిఫిన్ చేయడానికి వచ్చినట్టు తెలుస్తోంది. హోటల్‌కు వచ్చిన తరువాత ఇడ్లీ, పూరీ తదితర వాటిని ఆర్డర్ ఇచ్చాడు. దీంతో సంబంధిత వ్యక్తి వద్దకు వచ్చిన హోటల్ సిబ్బంది, ఇక్కడ అన్ని రకాల టిఫిన్‌లకు ధర ఎక్కువగా ఉంటుంది. మీధగ్గర అంత డబ్బు వుందా అంటూ అవహేళన చేసేలా ప్రవర్తించినట్టు తెలుస్తుంది. హోటల్ సిబ్బంది ప్రవర్తనతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడే విష్ణువర్ణన్ ధర్నాకు దిగాడు. ఈ సమయంలో హోటల్ సిబ్బంది ధర్నాకు దిగిన వ్యక్తిపై దాడికి యత్నించినట్టు తెలుస్తుంది. ఇరువర్గాల మద్య వాగ్వాదం పెరగడంతో విష్ణువర్ణన్ తన బంధువులు, సోదరులకు సమాచారం అందించి పిలిపించాడు. అక్కడికి వచ్చిన బంధువులతో కలిసి హోటల్ ముందు ధర్నాకు దిగారు. తననూ అవహేళన చేసిన వారిపై హోటల్ యాజమాన్యం చర్యలు తీసుకోవడంతో పాటు క్షమాపణలు చెప్పాలని నినాదాలు చేశాడు. దీంతో ఉద్రిక్తత పరిస్తితులు నెలకొంది. విషయం తెలుసుకున్న టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దాదాపు గంట పాటు చర్చలు జరిపారు. హోటల్ సిబ్బందిని పిలిపించి క్షమాపణలు చెప్పించి సమస్యను పరిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment