ఏకనాపురానికి విజయ్
● ఆంక్షలతో అనుమతి
సాక్షి, చైన్నె: గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి మద్దతుగా ఏకనాపురంలో తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ పర్యటించనున్నారు. ఈనెల 20వ తేదీన పోలీసులు విధించిన ఆంక్షల నడుమ ఆయన పర్యటనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వివరాలు.. చైన్నె విమానాశ్రయానికి ప్రత్యామ్నాయంగా మరో విమానాశ్రయం పనులు కాంచీపురం జిల్లా పరందూరు వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పరిసరాలలోని సుమారు ఐదు వేల ఎకరాల స్థలంలో ఈ విమానాశ్రయం రూపుదిద్దుకోనుంది. స్థల సేకరణకు వ్యతిరేకంగా ఏకనాపురం వేదికగా పదికిపైగా గ్రామాల ప్రజలు మూడు సంవత్సరాలుగా పోరాటాలు చేస్తూ వస్తున్నారు. వీరిని కలిసి తన సంఘీభావం తెలియజేయడానికి తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ నిర్ణయించారు. ఈ మేరకు ఆది లేదా సోమవారంలో ఏదో ఒక రోజు అక్కడ పర్యటించేందుకు నిర్ణయించారు. ఇందుకు అనుమతి కోరుతూ డీజీపీ శంకర్ జివ్వాల్‌తో పాటూ కాంచీపురం జిల్లా పోలీసు యంత్రాంగాన్ని విజయ్ తరపున ప్రతినిధులు కలిసి వినతి పత్రం సమర్పించారు.
ఆలస్యంగానైనా..
తొలుత అనుమతి అన్నది నిరాకరించినట్టు సమాచారాలు వెలువడ్డాయి. దీంతో తన ప్రతినిధులను ఏకనాపురానికి పంపించిన విజయ్ అక్కడి ప్రజలతో మాట్లాడించారు. అక్కడ ప్రజల ఆవేదన, ఆక్రోశాన్ని విజయ్ దృష్టికి తమిళగ వెట్రికళగం వర్గాలు నివేదిక రూపంలో తీసుకెళ్లాయి. ఈ పరిస్థితుల్లో విజయ్ ఏకనాపురం పర్యటనకు పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే కట్టుదిట్టమైన ఆంక్షలు విధించారు. ఎంపిక చేసిన ప్రదేశంలో మాత్రమే పర్యటించాలని, నిర్ణీత సమయం, నిర్ణీత వాహనాలకు అనుమతి అంటూ కొన్ని నిబంంధనలు విధించారు. దీంతో ఏకనాపురంలో విజయ్ తరపున రెండు చోట్ల స్థలాన్ని ఎంపిక చేసి ఏర్పాట్లు చేపట్టారు. సోమవారం ఏకనాపురానికి విజయ్ వెళ్లనున్నారు. ఇందుకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై కాంచీపురం జిల్లా పోలీసు యంత్రాంగం దృష్టి పెట్టింది. అదే సమయంలో ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లను తమిళగ వెట్రి కళగం ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్ పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment