సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గిరిజన (షెడ్యూల్డ్) ప్రాంతాల్లో 1/70 చట్టం వచ్చిన తర్వాత చేపట్టిన నిర్మాణాలకు సంబంధించిన యాజమాన్య హక్కును ధృవీకరించేలా మెరూన్ పాస్‌బుక్స్‌తోపాటు ఇతర పాస్‌బుక్స్ ఏవీ ఇవ్వరాదని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఆదివాసీ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు పి.శ్రీనివాస్‌తోపాటు మరొకరు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని విచారించిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. చదవండి: (‘ఇద్దరు పిల్లల’ నిబంధన ఎందుకు? )
సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా గిరిజన ప్రాంతాల్లో 1/70 చట్టం వచ్చిన తర్వాత చేపట్టిన అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీ్దకరించేలా ప్రభుత్వం మెరూన్ పాస్‌బుక్స్ మంజూరు చేస్తోందని పిటిషనర్ల తరఫు న్యాయవాది పీవీ రమణ నివేదించారు. ఈ మేరకు ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరారు. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని, గడువు ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ అభ్యర్థించగా, తదుపరి విచారణను ధర్మాసనం ఈ నెల 19కి వాయిదా వేసింది. ఈ పిటిషన్‌లో పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌లతోపాటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నాగర్‌కర్నూలు జిల్లాల కలెక్టర్లు, ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టర్లను ప్రతివాదులుగా చేర్చారు.
Comments
Please login to add a commentAdd a comment