టీఎస్ ఐపాస్‌తో అంతర్జాతీయ సంస్థలు తెలంగాణ బాటపట్టాయని, ఏదైనా వివాదం వచ్చినా వెంటనే పరిష్కరించడం కోసమే అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రాన్ని హైదరాబాద్‌లో నెలకొల్పినట్లు ఐటీ మంత్రి కేటీఆర్ చెప్పారు. వివాదాలను సమయానుకూలంగా పరిష్కరించడం కూడా ఎంతో ముఖ్యమన్నారు. మంగళవారం హయత్ హోటల్లో సిరిల్ అమర్‌చంద్ మోహన్‌దాస్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) నిర్వహించిన ఫైర్‌సైడ్ చిట్‌చాట్‌లో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సింగపూర్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వీకే రాజా, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎల్.నాగేశ్వరరావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘సింగపూర్‌లోని ఆర్బిట్రేషన్ సెంటర్‌ను ప్రపంచంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దడంలో జస్టిస్ రాజా కృషి ఎనలేనిది. ఆయన మార్గదర్శనం, సీఎం కేసీఆర్ కృషి కారణంగానే ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కారం కోసం హైదరాబాద్‌లో ఐఏఎంసీ ఏర్పాటైంది. సీఎం కేసీఆర్ పరిశ్రమలకు అనుమతిలో ఇబ్బందులను తెలుసుకుని సింగిల్ విండో విధానాన్ని రూపొందిస్తూ టీఎస్ ఐపాస్‌ను తెచ్చారు. దీంతో సమయం, నిధులు భారీగా ఆదా అవుతున్నాయి. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన కంపెనీలు ఇక్కడ తమ కార్యాలయాలను ఏర్పాటు చేశాయి. పారిశ్రామిక వివాదాల పరిష్కారం కోసమే ఐఏఎంసీ ఏర్పాటైంది’అని కేటీఆర్ వివరించారు.
ప్రత్యామ్నాయ వివాద పరిష్కార మార్గాలను పెంచేందుకు రాష్ట్రాలు దృష్టి సారించాలని జస్టిస్ రాజా సూచించారు. తొలిసారి హైదరాబాద్ రావడం ఆనందంగా ఉందని చెప్పారు. ‘కోర్టుల్లో దాఖలైన కేసుల్లో ఎక్కువ శాతం న్యాయం సరిగా అందడం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. మెరుగైన వివాద పరిష్కార వ్యవస్థలను ప్రోత్సహించాలి. న్యాయవ్యవస్థ సామర్థ్యాన్ని పెంపొందించపోతే మధ్యవర్తిత్వ కేంద్రం గ్లోబల్ హబ్‌గా మారదు. హైదరాబాద్ లాంటి నగరంలో సమర్థవంతమైన న్యాయవ్యవస్థ అవసరం’అని పేర్కొన్నారు.
అంతర్జాతీయ స్థాయికి ఐఏఎంసీ..
‘ఐఏఎంసీ నెమ్మదిగానైనా.. కచ్చితంగా అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందుతుంది. దేశంలో ఇప్పటికీ వ్యాపారాలు ప్రభుత్వాల నీడలోనే సాగుతున్నాయి. అవి ఈ నీడ నుంచి బయటపడి పూర్తి కార్పొరేట్‌గా మారినప్పుడు సంస్థాగత మధ్యవర్తిత్వం అవసరం అవుతుంది. ఇది వివాదాల సతర్వ పరిష్కారానికి దోహదం చేస్తుంది’అని హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ వెల్లడించారు. అనంతరం జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అడ్వొకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్, హెచ్‌సీఏఏ అధ్యక్షుడు రఘునాథ్‌తోపాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment