TS Balkonda Assembly Constituency: TS Election 2023: బాల్కొండ నియోజకవర్గంలో.. పొలిటికల్‌ అంశాలు!
Sakshi News home page

TS Election 2023: బాల్కొండ నియోజకవర్గంలో.. పొలిటికల్‌ అంశాలు!

Published Tue, Sep 19 2023 12:50 PM | Last Updated on Tue, Sep 19 2023 12:50 PM

Political Issues In Balkonda Constituency - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: బాల్కొండ నియోజకవర్గంలో రైతుల సమస్యలు, రుణమాఫీ, పంటలకు గిట్టుబాటు ధరలు, గల్ఫ్‌ వలస కార్మికుల సమస్యలు, బీడీ కార్మికుల సమస్యలు ప్రభావితం చేసే అవకాశం ఉంది. బీఆర్‌ఎస్‌ నుంచి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఒక్కరే పార్టీ టిక్కెట్‌ ఆశిస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి ఆరెంజ్‌ ట్రావెల్స్‌ అధినేత ముత్యాల సునీల్‌రెడ్డి, మాజీ విప్‌ అనిల్, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి టిక్కెట్‌ ఆశిస్తున్నారు. 

బీజేపీ నుంచి డాక్టర్‌ మల్లికార్జున్‌రెడ్డి, రుయ్యాడి రాజేశ్వర్‌లు టిక్కెట్‌ను ఆశిస్తున్నారు. నియోజకవర్గంలో మొత్తం 110 గ్రామ పంచాయతీలు, ఎనిమిది మండలాలతో పాటు రాజన్న సిరిసిల్లా జిల్లాలోని రుద్రంగి మండలంలోని కొంత భాగం నియోజకవర్గంలో ఉంది. భీమ్‌గల్‌ మండలం అతి పెద్ద మండలం, ప్రభావం చూపించే పంచాయతీ బాల్కొండ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,09,694 మంది, పురుషులు 96,878 మంది, స్త్రీలు 1,12,813 మంది, ఇతరులు 3 మంది. వృత్తిపరంగా ఓటర్లలో రైతుల సంఖ్యనే ఎక్కువగా ఉంటుంది. మతం పరంగా మైనార్టీ ఓటర్లు తక్కువగానే ఉంటారు.

నియోజకవర్గంలోని భౌగోళిక పరిస్థితులు గోదావరి నది పరివాహక ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. కమ్మర్‌పల్లి భీమ్‌గల్, రుద్రంగి మండలం మానాల పరిసరాల్లో అడవి విస్తరించి ఉంది. కొండలు కూడా బాగానే ఉన్నాయి. ఆలయాలలో ప్రసిద్ది చెందిన లింభాద్రి నర్సింహా స్వామి ఆలయం భీమ్‌గల్‌ మండలంలో ఉంది. చౌట్‌పల్లిలో శ్రీలక్ష్మినారాయణ స్వామి ఆలయం, తడపాకల్, పోచంపాడ్‌లలో శ్రీకోదండ రామాలయాలు ఉన్నాయి. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు కీలకమైన పర్యాటక ప్రాంతంగా ఉంది.

నియోజకవర్గంలో పసుపు సాగుకు ఇక్కడి రైతులు ప్రాధాన్యం ఇస్తారు. దేశంలో సాగు అయ్యే పసుపులో 15 శాతంకుపైగా పసుపు పంట ఈ బాల్కొండ నియోజకవర్గంలోనే సాగైతుంది. వరి పంట కంటే వాణిజ్య పంటలకే ఇక్కడి రైతులు మొగ్గుచూపుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి చేసే సజ్జలు, ఎర్రజొన్నలు, తెల్లజొన్నలు సాగుకు ఈ ప్రాంతం పేరుగాంచింది.

రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైన ప్రాంతం జిల్లా పరిషత్‌ మొట్టమొదటి ఛైర్మన్‌ హన్మంత్‌రెడ్డి ఈ నియోజకవర్గంలోని చౌట్‌పల్లికి చెందినవారు, అతని మనుమడు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు స్పీకర్‌గా పని చేసిన సురేష్‌రెడ్డి ఇప్పుడు బీఆర్‌ఎస్‌ తరపున రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. ఒకప్పటి పీసీసీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్‌ ఈ నియోజకవర్గంలోని వేల్పూర్‌కు చెందినవారు.

వేల్పూర్‌ మండలానికి చెందిన ప్రశాంత్‌రెడ్డి ఎమ్మేల్యేగా బాల్కొండ నియోజకవర్గంకు ప్రాతినిధ్యం వహిస్తుండగా ఇదే మండలం జాన్కంపేట్‌కు చెందిన జీవన్‌రెడ్డి ఆర్మూర్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఎన్‌ఎస్‌ఎఫ్‌ ఛైర్మన్‌గా పని చేసిన బద్దం నర్సారెడ్డి ఈ నియోజకవర్గంలోని దొన్కల్‌కు చెందినవారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement