వివాదంలో వికృతమాల భూములు | - | Sakshi
Sakshi News home page

వివాదంలో వికృతమాల భూములు

Published Thu, Oct 24 2024 1:32 AM | Last Updated on Thu, Oct 24 2024 1:33 AM

వివాదంలో వికృతమాల భూములు

వివాదంలో వికృతమాల భూములు

● ఒకరి పేరున ఉన్న భూములు ఇంకొకరి పేరుతో కొనుగోలు ● నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేసిన ప్రైవేటు సంస్థ ● ఆ భూములను ఆన్‌లైన్‌లో పొందుపరచాలని గతంలో రెవెన్యూశాఖపై ఒత్తిళ్లు ● తాజాగా రిజిస్ట్రేషన్‌ చేయాలంటూ టీడీపీ నేత ఒత్తిడి ● ఏం చేయాలో దిక్కుతోచక తలలు పట్టుకుంటున్న అధికారులు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: నిబంధనలకు విరుద్ధంగా కొ నుగోలు చేసిన భూములను రిజిస్ట్రేషన్‌ చేయాలంటూ టీడీపీ నేత అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తెస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ చేయకపోతే బదిలీ తప్పదని హెచ్చరించినట్లు విశ్వసనీయ సమాచారం. విశాఖపట్టణానికి చెందిన ఓ ప్రైవేటు సంస్థ తక్కువ ధరకే భూములు ఇప్పిస్తామంటూ నమ్మించి, రాష్ట్రవ్యాప్తంగా డిపాజిట్ల రూపంలో భారీగా నగదు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. డిపాజిట్లు చెల్లించిన వారిలో తిరుపతి జిల్లాకు చెందిన వారు అనేక మంది ఉన్నారు. గత కొన్నేళ్ల నుంచి రూ.కోట్ల రూపంలో డిపాజిట్లు సేకరించినా..లబ్ధిదారులకు భూములు చూపించలేదు. డబ్బులు కట్టిన వారంతా ఆ సంస్థపై తీవ్రస్థాయిలో ఒత్తిడి చేయడం ప్రారంభించారు. ఒత్తిళ్లు, కేసులు తట్టుకోలేక ఆ ప్రైవేటు సంస్థ 2007లో ఏర్పేడు మండలం వికృతమాల రెవెన్యూ పరిధిలో సుమారు 20 ఎకరాలను భూములు కొనుగోలు చేసింది. ఈ భూములు కొనుగోలు చేసిన వ్యక్తుల్లో టీడీపీకి చెందిన నాయకుడు కూడా కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. అయితే ఆ భూములను యజమానిని నుంచి కొనుగోలు చేయకుండా.. వారి వారసుల నుంచి కొనుగోలు చేశారు. అనంతరం ఆ భూములను రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు అధికారులు చుట్టూ తిరిగారు. మరో వైపు రెవెన్యూ అధికారులపైనా ఒత్తిడి చేశారు. రెండేళ్ల క్రితం కూడా రెవెన్యూ అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి చేయించారు. వికృతమాల రెవెన్యూ పరిధిలో ఇప్పటికే భూ వివాదాలు అధికంగా ఉండడంతో అధికారులు సాహసించలేకపోయారు.

అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఒత్తిళ్లు

జిల్లాలో రూ.20 కోట్లకు పైగా డబ్బులు కట్టిన బాధితులు గగ్గోలు పెడుతున్నారు. అయితే ఖాతాదారులకు ఇవ్వాల్సిన భూములను బినామీ పేర్లతో మార్చేందుకు భూములను రిజిస్ట్రేషన్‌ చేసేందుకు సన్నాహాలు చేశారు. శ్రీకాళహస్తి ని యోజకవర్గం ఏర్పేడు మండలం వికృతమాలలో ప్రైవేటు సంస్థ ఖాతాదారుల కోసం కొనిన భూ ములను వారికి రిజిస్ట్రేషన్‌ చేసేందుకు సన్నాహా లు చేశారు. బఫర్‌జోన్‌, కాలువలు, డీకేటీ భూములు కలుపుకుని లేఅవుట్‌ వేశారు. లేఅవుట్‌లో చూపించి, అమ్మేందుకు సన్నద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఎనిమిది నెలల ముందు నుంచే ఈ భూములు అమ్మేందుకు చలానాలు కట్టి రిజిస్ట్రేషన్‌ చేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. అందుకు రిజిస్ట్రార్‌ అంగీకరించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక టీడీపీ నాయకుడు ఆ భూములను అఽధికారులు అండదండలతో కాలువలు, డీకేటీ భూములు, బఫర్‌జోన్‌ పక్కన ఉన్న ఇతర పొలాలను కలుపుకుని బినామీ పేర్లతో మార్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. విషయం తెలుసుకున్న బాధితులు ప్రైవేటు సంస్థపై సమగ్రంగా విచారించి న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు. దీనిపై సబ్‌రిజిస్ట్రార్‌ సుధాకర్‌ను వివరణ కోరగా ప్రస్తుతం వెల్ఫేర్‌ భూములు ఏవీ రిజిస్ట్రేషన్‌చేయలేదని, అందుకు సంబంధించి ఎవరూ తమను సంప్రదించలేదని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement