లక్షలు ఇస్తే.. పోస్టులిప్పిస్తాం!
● వర్సిటీపై దళారుల పంజా ● తాత్కాలిక అధ్యాపకులు, నిరుద్యోగులే టార్గెట్ ● ఒప్పంద అధ్యాపక పోస్టులు ఇప్పిస్తామంటూ రూ.లక్షల్లో డిమాండ్
తిరుపతి సిటీ: ఎస్వీయూలో తాత్కాలిక అధ్యాపక పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో దళారులు రెచ్చిపోతున్నారు. వర్సిటీ అధికారులతో తమకు పరిచయాలు ఉన్నాయంటూ కొందరు, రాష్ట్ర స్థాయిలో మంత్రులతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న మరికొందరు నిరుద్యోగులను, ప్రస్తుత అకడమిక్ కన్సల్టెంట్లను వలలో వేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. అధికార పార్టీకి చెందిన బయట వ్యక్తులు, వర్సిటీలో పనిచేస్తున్న ఆ పార్టీ అనుచరులుగా గుర్తింపు పొందిన కొందరు వ్యక్తులు నిరుద్యోగులతో బేరసారాలు జరుపుతూ లక్షల్లో డిమాండ్ చేస్తున్నట్లు వర్సిటీ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
జీవో 115 ప్రకారం కొనసాగించండి
వర్సిటీలో ప్రస్తుతం ఉన్న సుమారు 260 మంది అకడమిక్ కన్సల్టెంట్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 110 జీవో అమలుకు నోచుకోకపోవడంతో వర్సిటీలో పనిచేస్తున్న తాత్కాలిక అధ్యాపకుల సర్వీసు పొడిగించకుండా అధికారులు నిలిపివేశారు. దీంతో వారు ఇంటి ముఖం పట్టడం తప్ప వేరే దారిలేదు. కానీ గత ఐదేళ్లుగా పనిచేస్తున్న తమకు 115జీవో ప్రకారం శాశ్వత నియామకాలు జరిగే వరకు కొనసాగించేందుకు అవకాశం ఉందని వారు వాపోతున్నారు.
ఒక్కో పోస్టుకు రూ.15 లక్షలు పైనే డిమాండ్
డిసెంబర్‌లో ఒప్పంద అధ్యాపక నియామకాల నోటిఫికేషన్ విడుదల కానున్న తరుణంలో అధికార పార్టీ నాయకులు దళారీ అవతారమెత్తి ఆశావహుల నుంచి ఒక్కో పోస్టుకు సుమారు రూ.10 లక్షల నుంచి రూ.15లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆశావాహులు విజయవాడ వేదికగా తమకు పరిచయమున్న అధికార పార్టీ నాయకులతో సంప్రదింపులు జోరందుకున్నట్లు తెలిస్తోంది.
ఆరోపణలు అవాస్తవం
నోటిఫికేషన్‌పై ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. వర్సిటీలో ప్రతి విభాగంలో ప్రిన్సిపాళ్ల ఆధ్వర్యంలో అవసరం మేరకు అధ్యాపకుల ఖాళీలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈసీ సమావేశంలో పెట్టి ఆమోదించిన తర్వాత నిబంధనల ప్రకారమే నోటిఫికేషన్ విడుదలకు ప్రయత్నిస్తాం. ఇందులో ఎటువంటి దళారీ వ్యవస్థకు చోటు లేదు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పక్కా పాటించడం జరుగుతుంది.
–ప్రొఫెసర్ సీహెచ్ అప్పారావు,
వీసీ, ఎస్వీయూ
Comments
Please login to add a commentAdd a comment