అధికారంతో తమ్ముళ్ల అరాచకం
● పచ్చని చెట్లపై పచ్చనేతల ప్రతాపం ● వైఎస్సార్‌సీపీ నేతకు చెందిన మామిడి చెట్లు నేలమట్టం ● పొలానికి వేసిన కంచెను కూల్చేసిన వైనం ● భాకరాపేట పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
భాకరాపేట: అధికార మదంతో తెలుగు తమ్ముళ్లు అరాచకం సృష్టిస్తున్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరిలో వైఎస్సార్‌సీపీ నేతలపై భౌతిక దాడులకు తెగబడుతున్నారు. వారి వ్యవసాయ భూములపై విచక్షణా రహితంగా విరుచుకు పడుతున్నారు. ఇలాంటి ఘటనే చిన్నగొట్టిగల్లు మండలం, భాకరాపేట గ్రామ పంచాయతీలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానిక సర్పంచ్, మాజీ సైనికుడు సాకిరి భూపాల్ వైస్సార్‌సీపీ మద్దతుదారుగా ఉంటూ గత ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేశారు. దీన్ని జీర్ణించుకోలేని స్థానిక టీడీపీ నేతలు అతనిపై పలుమార్లు దాడికి ప్రయత్నించారు. అది సాధ్యం కాకపోవడంతో అతని వ్యవసాయ క్షేత్రంపై విరుచుకుపడ్డారు. మామిడి మొక్కలను విరిచేశారు. మామిడి తోటకు కంచెగా నిర్మించిన రాతి స్తంభాలను ధ్వంసం చేశారు.
మాజీ సైనికుడు అన్న గౌరవం కూడా లేదు
సాకిరి భూపాల్ రాజకీయాల్లోకి రాకముందు భారత సైన్యంలో పనిచేశాడు. పదవీ విరమణ చెందిన తర్వాత ప్రభుత్వం ఇచ్చిన భూమిలో మామిడి, కొబ్బరి, టేకు చెట్లను సాగుచేసుకుంటున్నాడు. మాజీ సైనికుడు అన్న గౌరవం కూడా లేకుండా పచ్చ పార్టీ నేతలు ఇలా పచ్చని చెట్లను నరికివేయడం పట్ల స్థానికులు రగిలిపోతున్నారు.
రూ.50 లక్షలకు మేర నష్టం
భూపాల్‌కు చెందిన వ్యవసాయ క్షేత్రంలో 270 మామిడి చెట్లు, 220 టేకు చెట్లు, 12 కొబ్బరి చెట్లు, 3 సోలార్ సీసీ కెమెరాలను ధ్వంసం చేసినట్టు బాధితుడు వాపోయాడు. సుమారు రూ.50 లక్షల మేరకు ఆస్తి నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకున్న చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తుడా మాజీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ చార్జి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిలు బాధితుడుని పరామర్శించారు. చట్ట ప్రకారం పోరాడుదామని ధైర్యం చెప్పారు.
భూపాల్‌కు అండగా ఉంటాం
‘భూపాల్ పంట పొలాలపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. పచ్చని చెట్లను నరకడానికి వారికి మనసు ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. ఇలా రాజకీయ కక్షలతో పంటలను ధ్వంసం చేయడం చంద్రగిరి చరిత్రలో జరగలేదు. పోలీసులు వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలి. లేని పక్షంలో పోరాటాలకు సిద్ధమవుతాం. బాధితుడు భూపాల్‌కు అండగా నిలబడతాం’
– చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి,
తుడా మాజీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment