కార్గో పరిధి పెంచాలి
తిరుపతి అర్బన్: కార్గో డోర్‌డెలివరీ సర్వీసులు కేవలం తిరుపతి, శ్రీకాళహస్తి, వెంకటగిరి, పుత్తూరు డిపోలకే కాకుండా జిల్లాలోని 11 డిపోల నుంచి అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేయాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఆర్టీసీ అధికారులతో కలసి కార్గో డోర్‌డెలివరీ మాసోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. జిల్లాలో ఆర్టీసీ ఆధారంగా రోజు వారి ప్రయాణికుల వివరాలను తెలియజేయాలని అధికారులను కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రోజుకు 5 లక్షల మందికి పైగా ఆర్టీసీ ఆధారంగా ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారని, ల్లాలోని 11 డిపోల నుంచి రోజు వారి రాబడి రూ.1.5 కోట్ల నుంచి రూ.1.6 కోట్ల వస్తోందని వెల్లడించారు. 50 కేజీల లగేజీలు మాత్రమే కార్గో పాయింట్ నుంచి 10 కిలోమీటర్ల దూరం అందిస్తున్న తరుణంలో రాబోవు రోజుల్లో వాటి పరిధిని విస్తరించాలని చెప్పారు. తిరుపతి డీఎం బాలాజీ, ఏటీఎం డీఆర్ నాయుడు పాల్గొన్నారు.
డ్రైవింగ్ ట్రాక్‌లో సెన్సార్ ఏర్పాటు
తిరుపతి మంగళం : ఆర్టీఏ తిరుపతి రవాణాశాఖ కార్యాలయ ఆవరణంలోని డ్రైవింగ్ ట్రాక్‌లో సెన్సార్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు శుక్రవారం డీటీఓ మురళీమోహన్, ఎంవీఐలు సుబ్రమణ్యం, స్వర్ణలత తదితరులు సెన్సార్ పనులను పరిశీలించారు. వాహనదారులు డ్రైవింగ్ చేసేటప్పుడు సెన్సార్ ఏ విధంగా పనిచేస్తుందన్న విషయాలను అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సెన్సార్‌కు పక్కన సోకినా ఫెయిల్ చేస్తుందన్నారు. ఇప్పటికే చిత్తూరులోని రవాణాశాఖ కార్యాలయంలోని ఇలాంటిదే ఏర్పాటు చేశారని చెప్పారు.
రూ.6 లక్షలకుపైగా రికవరీ
భాకరాపేట : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవకతవకలకు పాల్పడిన వారి నుంచి రూ.6,43,172 రికవరీ చేయగా.. అపరాధం కింద రూ.1,06,000 చెల్లించేలా చర్యలు చేపట్టినట్టు డ్వామా పీడీ శ్రీనివాస్‌ప్రసాద్ తెలిపారు. చిన్నగొట్టిగల్లులోని జగనన్న సమావేశ మందిరంలో శుక్రవారం సామాజిక తనిఖీ బహిరంగ సభ నిర్వహించారు. 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి 31 వరకు 13 పంచాయతీల్లో జరిగిన 1,880 పనులకు రూ.5.34 కోట్లు వ్యయం చేసినట్టు వెల్లడించారు. వీటికి సంబంధించిన పనులను సామాజిక తనిఖీ బృందం క్షేత్ర స్థాయిలో పర్యటించి తనిఖీలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. ఈ మేరకు రికవరీ కింద రూ.6,43,172, అపరాధం కింద రూ.1,06,000 చెల్లింపులు చేపట్టినట్లు తెలిపారు. ఎంపీడీఓ గిడ్డయ్య పాల్గొన్నారు.
నేడు న్యాయమూర్తులకు వర్క్‌షాప్
తిరుపతి లీగల్: ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న న్యాయమూర్తులకు శనివారం చిత్తూరులో క్రిమినల్ చట్టాలపై వర్క్ షాప్ నిర్వహించనున్నట్టు జిల్లా కోర్టు నుంచి వివిధ ప్రాంతాలకు ఉత్తర్వులు అందాయి. రాష్ట్ర హైకోర్టు, రాష్ట్ర న్యాయ సేవ సంస్థ ఆదేశాల మేరకు చిత్తూరు కోర్ట్ ఆవరణలోని కాన్ఫరెన్స్ హాల్లో న్యాయమూర్తులకు క్రిమినల్ చట్టాలు, ప్రాక్టీసు, ప్రొసీజర్ అనే అంశంపై అవగాహన కల్పించనున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా జడ్జి భీమారావు ఆధ్వర్యంలో ఈ వర్క్ షాప్ ను నిర్వహించనున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని న్యాయమూర్తులు ఈ వర్క్ షాప్‌నకు వెళ్లనుండడంతో శనివారం మాత్రం అత్యవసర ఎఫ్‌ఐఆర్, రిమాండ్, మరణ వాంగ్మూలాలను ఆయా ప్రాంతాల్లోని తహసీల్దార్లు తీసుకొని విచారించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment