● రేపటి నుంచి తనిఖీలు ● ఒక్కో బృందంలో ముగ్గురు డాక్టర్లు, ఒక డిజిటల్ అసిస్టెంట్ ● జిల్లాకు నెల్లూరు, అన్నమయ్య జిల్లా నుంచి డాక్టర్లు ● సెక్యూరిటీ ఇవ్వాలని కోరిన వైద్యలు
తిరుపతి అర్బన్: పింఛన్ లబ్ధిదారులపై కూటమి ప్రభుత్వం పగబట్టినట్టుంది. అర్హత పరీక్ష పేరుతో ఏరివేతకు శ్రీకారం చుడుతోంది. వారు పెట్టే పరీక్షలో నెగ్గితేనే ఇకపై పింఛన్ అందుతుంది. లేదంటే కడుపు మాడ్చుకోవాల్సిన పరిస్థితే ఏర్పడుతుంది.
జిల్లాలో 27 రకాల పింఛన్లు
జిల్లాలో ప్రతినెలా 27 రకాలకు చెందిన 2,64,636 మంది లబ్ధిదారులకు రూ.112.25 కోట్ల మేర పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏడు నెలల్లోనే అందులో 7,188 మందిని తగ్గించారు. మరింత మందిని తగ్గించే ప్రయత్నంలో భాగంగా పలు దశలుగా పింఛన్ల తనిఖీలు చేపట్టనున్నారు. ఈ మేరకు సోమవారం నుంచి జిల్లాలో ఏడు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టనున్నారు. ఇందులో ముందుగా రూ.15వేలు పొందుతున్న పింఛన్‌దారులను తనిఖీ చేయనున్నారు.
సెక్యూరిటీ ఇవ్వండి సర్
సోమవారం నుంచి పింఛన్ తనిఖీలు మొదలుపెట్టనున్న నేపథ్యంలో ఒక్కో బృందంలో ఇద్దరు స్పెషలిస్ట్ డాక్టర్లు, ఒక పీహెచ్‌సీ డాక్టర్, సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అయితే సదరన్ సర్టిఫికెట్లు జిల్లా డాక్టర్లు ఇవ్వడంతో.. అదే డాక్టర్లు తనిఖీలు చేయడం సరికాదని నిర్ణయించారు. దీంతో నెల్లూరు, అన్నమయ్య జిల్లా నుంచి 14 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు తిరుపతి జిల్లాకు నియమించారు. ఈ క్రమంలో డాక్టర్లు తనిఖీల సమయంలో తమకు భద్రత కావాలని కలెక్టర్‌ను కోరినట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కో బృందానికి ఒక పోలీస్‌ను ఏర్పాటు చేయనున్నారు.
మొదటి దశ ఇలా..
మంచానికే పరిమితమై పక్షవాతంతోపాటు త్రీవమైన ముస్కులర్ డిస్ట్రోఫీ సమస్యలు ఉండి జిల్లాలో నెలకు రూ.15 వేలు పింఛన్ పొందుతున్న 1,200 మందిని మొదట పరిశీలించనున్నారు. ఈ నెల 7వ తేదీ నుంచి రోగుల ఇంటి వద్దకే వెళ్లి అర్హత పరీక్షలు చేపట్టనున్నారు. ఈ నెల 31కి తనిఖీల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. రోజుకు 25 మంది చొప్పున పరీక్షించనున్నట్టు సమాచారం.
రెండో దశ ఇలా
రెండో దశలో విభిన్న ప్రతిభావంతులతోపాటు కళాకారులు, వివిధ రోగాలకు చెందిన 23 రకాల పింఛన్‌దారుల 59,565 మందిని ఫిబ్రవరి 1వ తేదీ నుంచి తనిఖీ చేయనున్నారు.
మూడో దశలో..
మూడో దశలో మార్చి నుంచి జిల్లాలో వితంతువుల పింఛన్లు పొందుతున్న 70,341 మందివి తనిఖీ చేయనున్నారు. నవంబర్ 1 నుంచి డిసెంబర్ 1 వరకు మాత్రమే భర్త చనిపోయి వితంతువులైన వారికి 240 మంది కూటమి ప్రభుత్వం జిల్లాలో కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. నవంబర్ 1కి ముందు భర్త చనిపోయి వితంతువు అయితే వారు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వకపోవడం గమనార్హం.
నాల్గో దశలో..
4వ దశలో పింఛన్లు పొందుతున్న 1,32,890 మంది వృద్ధులను ఏప్రిల్‌లో తనిఖీ చేయనున్నారు. ఇప్పటికే ఈ ఏడు నెలల కాలంలో 7,188 మందిని తొలగించిన సంగతి తెలిసిందే. ఎందుకుని అధికారులను ప్రశ్నిస్తే వారంతా మృతి చెందారని సమాధానం ఇస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment