ఇంత దుర్మార్గమా బాబూ!
నిరసన వ్యక్తం చేస్తున్న భూమన అభినయ్‌రెడ్డి, మేయర్ శిరీష, కార్యకర్తలు
కూటమి ప్రభుత్వం బరితెగించింది. నిబంధనలను తుంగలో తొక్కింది. తిరుపతి కార్పొరేషన్ డెప్యూటీ మేయర్ పదవి కోసం విధ్వంసానికి పాల్పడింది. బలం లేకపోయినా బరిలో నిలిచేందుకు కుయుక్తులు పన్నింది. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లను భయభ్రాంతులకు గురిచేసింది. ఆస్తులను ధ్వంసం చేస్తూ తమవైపు తిప్పుకునేందుకు పన్నాగం పన్నింది. నగర ప్రథమ పౌరురాలిపై అమానవీయంగా ప్రవర్తించి అగౌరపరిచింది. ఇంత జరుగుతున్నా అధికారయంత్రాంగం చూస్తూ ఉండిపోవడం.. కూటమి నేతలకే వత్తాసు పలకడం విస్మయానికి గురిచేసింది.
ప్రజాస్వామ్యం అపహాస్యం
వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ల ఆస్తుల విధ్వంసం
● నోటీసులు ఇవ్వకుండా అక్రమం అంటూ కూల్చివేతలు
● సాక్షాత్తు నగర ప్రథమ పౌరురాలు చెబుతున్నా వినకుండా దౌర్జన్యం
● కూల్చివేతలను అడ్డుకునేందుకు యత్నించిన వారి గొంతు నొక్కిన అధికారులు
● మహిళలను అడ్డుకునేందుకు మహిళా పోలీసులు లేరా?
● ఆధ్యాత్మిక నగరంలో డెప్యూటీ మేయర్ కోసం అధికార అరాచకం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి కార్పొరేషన్ డెప్యూటీ మేయర్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకానికి అడ్డేలేకుండా పోతోంది. బలం లేకపోయినా బరితెగింపునకు దిగింది. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లను భయపెట్టి డెప్యూటీ మేయర్ పీఠాన్ని కై వశం చేసుకునేందుకు ఆస్తుల విధ్వంసానికి తెరదీసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ.. అధికారులు అధికార పార్టీ నేతల అండతో రెచ్చిపోవడం.. మేయర్ డాక్టర్ శిరీష చెబుతున్నా వినకుండా ఆమె పట్ల అమానవీయంగా ప్రవర్తించడం విమర్శలకు తావిస్తోంది.
బలం లేకపోయినా..
తిరుపతి కార్పొరేషన్ డెప్యూటీ మేయర్ ఉప ఎన్నిక ఈనెల 3న జరగనుంది. ఈ ఎన్నిక కోసం వైఎస్సార్‌సీపీ తరఫున డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా 42వ డివిజన్ కార్పొరేటర్ శేఖర్‌రెడ్డిని బరిలోకి దింపారు. కార్పొరేషన్ పరిధిలో మొత్తం 50 డివిజన్లలో 48 వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలుపొందినా.. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ పార్టీ నేతలు కొందరు కార్పొరేటర్లను భయపెట్టి లాక్కున్నారు. అలా 9 మంది కార్పొరేటర్లు వారివైపు ఉన్నా.. మిగిలిన 39 మంది కార్పొరేటర్లు వైఎస్సార్‌సీపీ వారే. ఏ రకంగా చూసినా తిరిగి డెప్యూటీ మేయర్ పదవి వైఎస్సార్‌సీపీకే దక్కాలి.
భూమన అభినయ్‌రెడ్డిని తీసుకెళ్తున్న పోలీసులు
తిరుపతి మంగళం: ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో కూటమి ప్రభుత్వంలోని పాలకులు అరాచకం సృష్టించారు. డిప్యూటీ మేయర్ ఎన్నికలో ఎలాగైనా గెలవడానికి అనైతికంగా అధికారులను అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరించారని వైఎస్సార్‌సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి మండిపడ్డారు. తిరుపతిలోని తన నివాసంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పాలనలో ఇంత దుర్మార్గమా..? ప్రభుత్వ అధికారులు కూటమి ప్రభుత్వానికి బానిసలుగా పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా ప్రకటించిన శేఖర్‌రెడ్డిని, అతని కుటుంబాన్ని భయపెట్టి లొంగదీసుకోవడం సిగ్గుచేటన్నారు. తమ పార్టీ నాయకులు గఫూర్, లక్ష్మణ్ ఇళ్లను కూడా కూల్చివేశారన్నారు.
సుప్రీంకోర్టుకు వెళ్తాం
నిర్మాణాల కూల్చివేతపై సుప్రీంకోర్టు ఆదేశాలను తిరుపతి మున్సిపల్ అధికారులు బేఖాతర్ చేశారని భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయివేటు స్థలాలను ఆక్రమించి ఉంటే, ఆ కట్టడాలను పడగొట్టేందుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను కార్పొరేషన్ అధికారులు పాటించలేదని, దీనిపై తాము సుప్రీం కోర్టుకు వెళ్తామని ఆయన హెచ్చరించారు.
డెప్యూటీ మేయర్ అభ్యర్థిగా లడ్డూ భాస్కర్‌రెడ్డి
శేఖర్‌రెడ్డి పోటీ నుంచి తప్పుకుంటే తిరుపతి 47వ డివిజన్ కార్పొరేటర్ లడ్డూ భాస్కర్ రెడ్డిని డెప్యూటీ మేయర్ అభ్యర్థిగా తాము నిలబెడుతున్నామని ప్రకటించారు. సమావేశంలో మేయర్ డాక్టర్ శిరీష, చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి, కార్పొరేటర్లు లడ్డూ భాస్కర్‌రెడ్డి, ఆదం రాధాకృష్ణారెడ్డి, తమ్ముడు గణేష్ పాల్గొన్నారు.
నిబంధనలకు విరుద్ధం
టౌన్ ప్లానింగ్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని మేయర్ డాక్టర్ ఆర్.శిరీష అన్నారు. అక్రమ కూల్చివేతలను అడ్డుకునేందుకు ఆమె తన అనుచరులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. భూమన అభినయ్‌రెడ్డితో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కూల్చివేతలపై న్యాయపోరాటం చేస్తామని, ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరూ దోషులుగా కోర్టు ముందు నిలబెడతామని హెచ్చరించారు.
కుట్రలు..ఒత్తిళ్లు
ఒకే ఒక్క డివిజన్‌ని గెలుసుకున్న టీడీపీ మరికొందరు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లతో డెప్యూటీ మేయర్ పదవిని లాక్కునేందుకు అరాచకాలకు దిగింది. శేఖర్‌రెడ్డిని పోటీ నుంచి తప్పుకోవాలని, వారి కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు చేశారు. నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి కూటమి నేతలు పోలీసులు, కార్పొరేషన్, రెవెన్యూ అధికారులను రంగంలోకి దింపి వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ల ఆస్తుల విధ్వంసానికి తెరదీశారు. కూటమి నేతలు అధికారాన్నంతా ఉపయోగించి వైఎస్సార్‌సీపీ డెప్యూటీ మేయర్ అభ్యర్థి శేఖర్‌రెడ్డిని శనివారం రాత్రి తమవైపు తిప్పుకున్నారు.
ఈడ్చిపడేశారు
నగర ప్రథమ పౌరురాలు డాక్టర్ శిరీష, వైఎస్సార్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి, మహిళా నాయకురాళ్లుని ఈడ్చిపడేశారు. పత్రికలో రాయలేని పదాలతో తిట్ల పురాణం అందుకున్నారు. పోలీసులు చుట్టుముట్టి నెట్టుకుంటూ భూమన అభినయ్‌రెడ్డిని బయటకు లాగి పడేశారు. పోలీసులు విచక్షణ కోల్పోయి వ్యవహిరించిన తీరు విస్మయానికి గురిచేసింది. మహిళ పట్ల మగ పోలీసులు వ్యవహరించిన తీరుపై పార్టీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment