![చేపాచ](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/5/04tpl53a-300079_mr-1738695623-0.jpg.webp?itok=iw4Yo-Dq)
చేపాచేపా ఎప్పుడొస్తావ్?
– చెరువుల్లో చేప పిల్లలు వదలడానికి వాయిదాలు
తిరుపతి అర్బన్: జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లలను వదలడానికి మత్స్యశాఖ అధికారులు వాయిదాలపై వాయిదాలు వేస్తూనే ఉన్నారు. అదిగో ఇదిగో అంటూ నాలుగు నెలలుగా కాలయాపన చేస్తున్నారు. సాధారణంగా గడిచిన పదేళ్లుగా బాపట్ల ప్రాంతం నుంచి చేప పిల్లలను సెప్టెంబర్‌లో తెచ్చుకుని రెండు నెలల పాటు జాలర్ల సమక్షంలో పెంచడం.. తర్వాత చెరువుల్లోకి నీళ్లు వచ్చి అనంతరం నవంబర్, డిసెంబర్‌లో వదిలిపెట్టేవారు. ఆ తర్వాత మూడు నెలల్లోనే (90 రోజులు) చెరువుల్లో చేప పిల్లలు పెద్దవై.. కేజీకి పైగా తూకం వచ్చేవి. వీటిని విక్రయించడం ద్వారా ఆదాయం వచ్చేది. అయితే కూటమి ప్రభుత్వం చేప పిల్లలను తెప్పించడం మానేశారు. జాలర్ల సమక్షంలో పెంచే కార్యక్రమానికి స్వస్తి పలికారు. జనవరి మొదటి వారంలో చెరువుల్లో చేప పిల్లలను వదలనున్నట్లు మొదట ప్రకటించారు. తర్వాత జనవరి చివరి వారం, అనంతరం ఫిబ్రవరి 1 నుంచి అంటూ ప్రచారం చేశారు. తాజాగా మరో మూడు రోజుల్లో ప్రారంభిస్తామని చెబుతున్నారు. చేప పిల్లలు వదిలిపెట్టిన తర్వాత మూడు నెలలు ఉంటేనే కేజీకి పైగా తూకం వస్తాయి. అయితే మార్చి 31కి జిల్లాలోని 90 చెరువుల్లో నీళ్లు ఉండవు. ఇప్పటికిప్పుడు వదిలిపెట్టినా 50 రోజులు మాత్రమే గడువు ఉంటుంది. కనీసం అర కేజీ అయినా తూకం వస్తాయని అంతా భావిస్తున్నారు. అయినా వదిలిపెట్టకుండా వాయిదాలు వేయడంపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు.
మూడు రోజుల్లో వదులుతాం
మరో మూడు రోజుల్లో చేప పిల్లలను చెరువుల్లో వదులుతాం. ముందుగా మత్స్యకారుల సొసైటీలున్న చెరువుల్లో, ఆ తర్వాత చెరువుల్లో నీటి శాతాన్ని బట్టి చేప పిల్లలు వదులుతాం.
– నాగరాజు, జిల్లా మత్స్యశాఖ అధికారి
![చేపాచేపా ఎప్పుడొస్తావ్? 1](https://www.sakshi.com/gallery_images/2025/02/5/04tpl54-300079_mr-1738695623-1.jpg)
చేపాచేపా ఎప్పుడొస్తావ్?
Comments
Please login to add a commentAdd a comment