అంగరంగ వైభవంగా రథసప్తమి వేడుకలు
● శ్రీవారి పాదాలను తాకిన ఉషాకిరణాలు ● సప్త వాహనాలపై దర్శనమిచ్చిన మలయప్ప స్వామి ● భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ● రాత్రి వరకు తగ్గని రద్దీ
అశేష భక్తజనం నడుమ చక్రస్నానంలో సేద తీరుతూ..
తిరుమల: తిరుమలలో రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తుల కోలాహలం మధ్య శ్రీమలయప్పస్వామి వారు సూర్యోదయం నుంచి రాత్రి వరకు సప్త వాహనాల్లో విహరించారు. ఉత్సవం నేపథ్యంలో ఉషోదయాన ప్రాతఃకాల ఆరాధన పూర్తికాగానే ఆలయం నుంచి వాహన మండపానికి శ్రీమలయప్పస్వామి వేంచేశారు. ఇక్కడ వజ్రకవచధా రి అలంకారభూషితులై సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ తిరువీధుల్లో వాయువ్య దిశకు చేరుకున్నారు. ఉదయం ఉదయభాను కిరణాలు స్వామివారి పాదాలను తాకాయి. శ్రీవారి పాదాలపై ఉషాకిరణాలు ప్రసరించి సూర్య భగవానుడు అంజలి ఘటించారు. ఈ సమయంలో భక్తకోటి అఖండ గోవిందనామ కీర్తనలతో వేంకటాచలం ప్రతిధ్వనించింది. సూర్యప్రభ వాహనాన్ని వీడి చిన్నశేష వాహనాన్ని స్వామి అధిష్టించి చతుర్మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. అనంతరం గరుడ, హనుమంత వాహనాలపై ఊరేగి వాహన మండపానికి వేంచేశారు. మధ్యాహ్నం శ్రీమలయప్పస్వామి ఆలయానికి చేరుకున్నారు. భారీ సంఖ్యలో భక్తులు వాహనసేవల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు.
వైభవంగా చక్రస్నానం
శ్రీసుదర్శన చక్రతాళ్వారులు ఊరేగుతూ శ్రీవరాహస్వామి ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. సుదర్శన భగవానునికి శ్రీవారి పుష్కరిణిలో పవిత్ర స్నా నం నిర్వహించారు. అనంతరం శ్రీవారు శ్రీదేవి, భూదేవి సమేతంగా కల్పవృక్ష, సర్వభూపాల వాహనాలపై ఊరేగారు. రాత్రి చంద్రోదయం సమయాన చంద్రప్రభ వాహనంపై శ్రీమలయప్పస్వామి ఒక్కరే ఊరేగి తిరిగి వాహన మండపానికి చేరుకున్నారు.
స్వల్పంగా తోపులాటలు
వాహనసేవ గంటల వ్యవధిలోపే ముగించాల్సి ఉండడంతో వేగం కారణంగా స్వల్పంగా తోపులాటలు చోటు చేసుకున్నాయి. అయితే వాహన సేవల ముందు భక్తుల పట్ల భద్రతా సిబ్బంది దురసుగా వ్యవహరిస్తూ తొసివేయడంపై కొందరు అసహనం వ్యక్తం చేశారు. భారీగా అధికారులు, బోర్డు సభ్యులు కుటుంబ సభ్యులు వాహనముందు చేరడంతో వారిని పక్కకు పంపడం భద్రతా సిబ్బందికి ఇబ్బందికరంగా మారింది. రాంభగీచావద్ద భక్తులను అనుమతించకపోవడంతో పోలీసులతో స్వల్ప వాగ్వివాదం చోటుచేసుకుంది.
నిరంతరాయంగా అన్నప్రసాదాల వితరణ
గ్యాలరీల్లోని భక్తులకు పాలు, మజ్జిగ, అన్నప్రసాదాలను టీటీడీ నిరంతరాయంగా అందించింది. మాతృశ్రీ తరిగొండ వెంబమాంబ అన్నప్రసాద సముదాయంతో పాటు తిరువీధుల్లోని గ్యాలరీల్లోని భక్తులకు అన్నప్రసాదాలు, పాలు, కాఫీ, మజ్జిగ అందించారు. టీటీడీ ఈవో శ్యామలారావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో మణికంఠ, ఎస్పీ హర్షవర్ధన్ రాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment