సిరుల తల్లికి.. శిరసాభివందనం
● రథసప్తమి వేళ.. సప్త వాహనాలపై పద్మావతి అమ్మవారి దర్శనం
తిరుపతి రూరల్ : సిరుతల్లి శ్రీ పద్మావతీ అమ్మవారి దర్శనార్థం భక్తులు పోటెత్తారు. సూర్య జయంతిని పురస్కరించుకొని తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఒకేరోజు ఏడు వాహనాలపై అమ్మవారు దర్శనం ఇవ్వడంతో ఈ ఉత్సవాలు బ్రహ్మోత్సవాలను తలపించాయి. ఉదయం 7 గంటలకు సూర్యప్రభ వాహనంతో ప్రారంభమైన వాహన సేవలు మధ్యాహ్నం 2 గంటల వరకు నిరాటంకంగా సాగాయి. హంస, అశ్వ, గరుడ, చిన్న శేష వాహనాలపై అమ్మవారు విహరించారు. సాయంత్రం 3.30 నుంచి 4.30 గంటల వరకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు చంద్రప్రభ, గజ వాహన సేవలు అత్యంత వైభవంగా సాగాయి.
పోటెత్తిన భక్తజనం
సిరుల తల్లికి శిరసాభి వందనం అన్నట్లుగా భక్తులు అమ్మవారి వాహనసేవల్లో పాల్గొని గోవిందా.. గోవిందా.. అంటూ ప్రార్థిస్తూ ప్రణమిళ్లారు. ఒక్క రోజు బ్రహ్మోత్సవంగా పిలిచే రథసప్తమి పర్వదినాన అమ్మవారు సప్త వాహనాలపై ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
రథసప్తమి పర్వదినాన కళాకారులు ప్రదర్శించిన దేవతా మూర్తుల కళా రూపాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు కళాకారులు చేసిన నృత్యాలు, కోలాటాలు, చెక్క భజనలు అలరించాయి. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు అమ్మవారి వాహనసేవల్లో తరించారు.
Comments
Please login to add a commentAdd a comment