ఎల్‌ఎల్‌ఎం పరీక్షా ఫలితాల విడుదల
తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో గత ఏడాది అక్టోబర్‌లో నిర్వహించిన ఎల్‌ఎల్‌ఎం రెండవ సెమిస్టర్ ఫలితాలు మంగళవారం విడుదల చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎం.దామ్లానాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఫలితాల కోసం వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించాలని కోరారు.
నేడు ప్రాక్టికల్స్ పరీక్ష
నిర్వహణపై సమీక్ష
తిరుపతి ఎడ్యుకేషన్: ఈ నెల 10నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ జనరల్ ప్రాక్టికల్స్ పరీక్షను నిర్వహించనున్నట్లు ఇంటర్ ప్రాంతీయ పర్యవేక్షణాధికారి(ఆర్‌ఐఓ) జీవీ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఈ పరీక్ష నిర్వహణపై బుధవారం ఉదయం 10గంటలకు తిరుపతిలోని ఎస్వీ జూనియర్ కళాశాలలో సమీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని యాజమాన్య కళాశాలల్లో పనిచేస్తున్న సైన్స్(ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, బోటనీ) లెక్చరర్లు తప్పనిసరిగా ఈ సమీక్షకు హాజరవ్వాలని ఆర్‌ఐఓ కోరారు.
రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
చంద్రగిరి: రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని శ్రీనివాసమంగాపురం సమీపంలోని రైల్వే గేటు వద్ద మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. గుర్రంకొండ మండలం అరిగివారిపల్లికి చెందిన రవి కుమార్ యాదవ్(55) శనివారం రాత్రి తిరుపతి నుంచి వెళ్తున్న రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శరీరంపై నుంచి రైలు వెళ్లడంతో మృతదేహం ఛిద్రమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం రైల్వే అధికారులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తిరుపతి మెడికల్ కళాశాలకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కల్వర్టును ఢీకొన్న బొలెరో
కల్వర్టును బొలెరో ఢీకొనడంతో డ్రైవరు గాయాలపాలయ్యాడు. ఈ ఘటన మంగళవారం పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై అగరాల సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. చిత్తూరు నుంచి తిరుపతి వైపు వస్తున్న బొలెరో వాహనం అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న కల్వర్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ బాలాజీకి తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో తిరుపతి రుయాకు తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యాధికారులు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment