మోసకారి చంద్రబాబు
– డీసీసీబీ మాజీ చైర్మన్ సత్యనారాయణరెడ్డి
పెళ్లకూరు: ‘ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ యువగళం పాదయాత్ర నుంచి 2024 ఎన్నికల ప్రచారంలో అనేక వాగ్ధానాలు చేసి అధికారంలోకి రాగానే మాట మార్చిన ‘ద గ్రేట్ మోసకారి చంద్రబాబు’ అని డీసీసీబీ మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి ఘాటుగా విమర్శించారు. మంగళవారం చిల్లకూరులోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై పలు ప్రశ్నలు సంధించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 20 లక్షలు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ప్రతి నెలా రూ.3 వేలు ఎక్కడని నిలదీశారు. 2025 జనవరి 1న విడుదల చేస్తామన్న జాబ్ క్యాలెండర్, వలంటీర్లను కొనసాగిస్తూ రూ.10 వేలు పారితోషకం ఇస్తామని చెప్పిన మాట ఎక్కడన్నారు. అధికారంలోకి రాగానే లక్షలాది కంపెనీలు తీసుకొచ్చి సృష్టిస్తామన్న సంపద ఎక్కడ?, బడికి వెళ్లే ఒక్కో బిడ్డకు రూ.15 వేలు ఇస్తామన్న తల్లికి వందనం ఎక్కడ?, రైతుకు రూ.20 వేలు ఇస్తామన్న పెట్టుబడి ఎక్కడ?, ఇంట్లో 19 నుండి 59 ఏళ్లు ఉన్న మహిళలకు ఒక్కరుంటే రూ.1,500, ఇద్దరుంటే రూ.3 వేలు, ముగ్గురుంటే రూ.4,500 అని చెప్పిన మాట ఎక్కడ?, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం, పొదుపు మహిళలకు ఇస్తామన్న రూ.18 వేలు ఎక్కడని నిలదీశారు. కూటమి పాలనలో ఆ పార్టీ శ్రేణులంతా ఇసుక దోపిడీ, గ్రావెల్ మాఫియా, బెల్టు షాపులతో అక్రమ ధనార్జన కోసమే నిరంతరం శ్రమిస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెప్పే సమయం త్వరలో వస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment