కీలక కమిటీలు ఓసీలకే
● మార్కెట్ కమిటీలకు రిజర్వేషన్లు ఖరారు ● జిల్లాలో 12 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ● అత్యధిక రాబడి శ్రీకాళహస్తి కమిటీకే.. ● నామినేటెడ్ పదవులకు లాబీయింగ్ మొదలు ● జనరల్‌కే అధిక స్థానాలు
తిరుపతి అర్బన్: జిల్లాలోని 12 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు చైర్మన్ పదవులు భర్తీ చేయడానికి రిజర్వేషన్లను కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ బుధవారం వెల్లడించారు. ఆ మేరకు ఆయన మాట్లాడుతూ సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీకి ఓసీ(జనరల్)కు, సూళ్లూరుపేట కమిటీకి బీసీ(మహిళ)కు, శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని శ్రీకాళహస్తి వ్యవసాయ మార్కెట్ కమిటీకి ఓసీ(మహిళ)కు, గూడూరు నియోజకవర్గంలోని గూడూరు వ్యవసాయ మార్కెట్ కమిటీకి ఓసీ(జనరల్), వాకాడు మార్కెట్ కమిటీకి ఎస్సీ(మహిళ)కు, చంద్రగిరి నియోజకవర్గంలో తిరుచానూరు వ్యవసాయ మార్కెట్ కమిటీకి ఓసీ(జనరల్)కు, పాకాల మార్కెట్ కమిటీకి ఎస్సీ(జనరల్‌కు), చంద్రగిరి మార్కెట్ కమిటీకి బీసీ(మహిళ)కు, సత్యవేడు నియోజకవర్గంలోని బీఎన్ కండ్రిగ మార్కెట్ కమిటీని ఎస్టీ(జనరల్‌కు), నాగలాపురం ఓసీ(మహిళకు), నగరి నియోజకవర్గంలోని పుత్తూరు వ్యవసాయ మార్కెట్ కమిటీకి బీసీ(జనరల్)కు, వెంకటగిరి నియోజకవర్గంలోని వెంకటగిరి మార్కెట్ కమిటీకి ఓసీ(మహిళ)కు కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు. రిజర్వేషన్ ప్రకారమే వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్లను ఖరారు చేయాల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు. రెండేళ్లపాటు చైర్మన్ పదవీకాలం ఉంటుందని ఆయన వెల్లడించారు.
రిజర్వేషన్ల వివరాలివీ..
సామాజికవర్గం కేటాయింపు సంఖ్య
ఓసీ 6
బీసీ 3
ఎస్సీ 2
ఎస్టీ 1
మొత్తం 12
ఆదాయ మార్కెట్ కమిటీలు ఓసీలకే
రాబడి అధికంగా ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీలను ఓసీలకే కేటాయింపు చేశారని చర్చసాగుతుంది. ప్రధానంగా జిల్లాలో అత్యధిక రాబడి వచ్చే వ్యవసాయ మార్కెట్ కమిటీ శ్రీకాళహస్తి. ఈ సారి ఈ కమిటీని బీసీలకు కేటాయిస్తారని కొద్ది నెలలుగా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అయితే ఎంచెక్కా ఓసీ మహిళకు కేటాయించారు. అలాగే నాయుడుపేట, గూడూరు, తిరుచానూరు, వెంకటగిరి మార్కెట్ కమిటీలపైనా బీసీలు ఆశలు పెట్టుకున్నారు. అయితే కీలకమైన కమిటీలను ఓసీలకే కేటాయించారని పలువురు బీసీ నేతలు చర్చించుకుంటున్నారు. సీఎం చంద్రబాబు టీడీపీ అంటేనే బీసీల పార్టీ అంటూ పదేపదే ఉపన్యాసాలు చేస్తుంటారని, అయితే పదవులు మాత్రం ఓసీలకు కట్టబెడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment