ఊర్లో దొంగలు పడ్డారు!
● 9 ఇళ్లలో చోరీ ● బంగారు, వెండి, నగదు అపహరణ
చంద్రగిరి: ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 9 ఇళ్లకు కన్నం వేసిన సంఘటన మండలంలోని ముంగళిపట్టులో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. చంద్రగిరి మండలంలోని ముంగళిపట్టు గ్రామంలో కొద్ది రోజులుగా గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించారు. గ్రామంలో సుమారు 9 ఇళ్లలో ఎవరూ లేరని దుండగులు నిర్ధారించుకున్నారు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి సుమారు ఏడుగురు సభ్యులు గల దొంగల ముఠా గ్రామంపై పడినట్లు తెలిపారు. గ్రామంలోని ప్రభాకర్‌నాయుడు, లత, శివలీల, సోమేష్, గిరి నాయుడు, రామ్మూర్తి శెట్టి, ముంగళిపట్టు ఎస్సీ కాలనీ సమీపంలో ని దిలీప్ నాయుడు, మురళి, నాగమ్మ ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. బుధవారం ఉదయం స్థానికులు ఆ ఇళ్ల లోని విలువైన వస్తువులు, ఆభరణాలు, నగదు దోచు కెళ్లిన్నట్లు గుర్తించారు. అనంతరం ఆయా ఇళ్ల యజ మానులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు.
ఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ
ముంగళిపట్టులో చోరీ జరిగినట్లు తెలుసుకున్న చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్, సీఐ సుబ్బరామిరెడ్డి తన బృందంతో కలసి చోరీ జరిగిన ఇళ్లను పరిశీలించారు. ఆయా ఇళ్లలో చిందరవందరగా పడి ఉన్న వస్తువులను పరిశీలించి, క్లూస్ టీం అధికారులకు సమాచారం అందించారు. చోరీ దృశ్యాలు సీసీ కెమరాల్లో రికార్డు కావడంతో ఆ దిశగా పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు. చోరీలపై పోలీసులను వివరణ కోరగా...ఇప్పటి వరకు బాధితులు నుంచి సరైన ఫిర్యాదు అందించలేదని, ఫిర్యాదులు అందిన తర్వాత వివరాలను వెల్లడిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment