విద్య ఆయుధం కావాలి: కలెక్టర్
అనంతగిరి: విద్యార్థులకు చదువే ఆయుధం కావాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. బాగా చదువుకుంటే మంచి భవిష్యత్ ఉంటుందని తెలిపారు. చదువును అశ్రద్ధ చేయరాదని సూచించారు. గురువారం వికారాబాద్‌లోని సంఘం లక్ష్మీబాయి గురుకుల పాఠశాలలో బాలల దినోత్సవం నిర్వహించారు. కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చిన్నారులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నెహ్రూ పుట్టిన రోజును బాలల దినోత్సవం జరుపుకోవడం సంతోషమన్నారు. ఇది మన రోజు.. మనం బాగా ఉండాలి, బాగా చదవాలి, ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలు చేరుకోవాలి.. జిల్లాకు మంచి పేరు తేవాలని విద్యార్థులకు సూచించారు. నేను మీలాగే కష్టపడి చదివి ఈ స్థాయికి వచ్చానని తెలిపారు. బాల్యం నుంచే చదువుపై శ్రద్ధ వహించాలన్నారు. అనంతరం పరిగి బాలసదనం విద్యార్థినుల నృత్య ప్రదర్శనను తిలకించారు. చక్కటి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. అంతకుముందు పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించారు. కార్యక్రమంలో డీఈఓ రేణుకాదేవి, శిశు సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి, ప్రిన్సిపాల్ వేణుగోపాల్‌రెడ్డి, కాంతారావు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment