తేరుకోని ఫార్మా పల్లెలు
దుద్యాల్: లగచర్ల ఘటన జరిగి నాలుగు రోజులు కావస్తున్నా ఫార్మా బాధిత తండాల్లో పరిస్థితులు కొలిక్కిరావడం లేదు. దుద్యాల్ మండలం లగచర్ల, రోటిబండ తండా, పులిచెర్లకుంట తండాల్లో ప్రజలను భయం వీడటం లేదు. ఏ వీధిని చూసినా ఖాళీగానే దర్శనమిస్తోంది. రోటిబండ తండా, పులిచెర్లకుంట తండాల్లో ఇళ్లకు తాళాలు దర్శనమిస్తున్నాయి. అధికారులపై దాడి జరిగింది మొదలు నేటి వరకు ప్రజలు ఇళ్లకు రావడం లేదు. మంగళవారం అర్ధరాత్రి గ్రామంలోకి ప్రవేశించిన పోలీసులు దొరికిన వారిని దొరికినట్లు అదుపులోకి తీసుకున్నారు. దాడితో సంబంధం లేని 39 మందిని విడిచిపెట్టారు. 26 మంది కోసం నాలుగు బృందాలు గాలిస్తున్నాయి.
మేకలను ఎత్తుకెళ్లిన దుండగులు
రోటిబండ తండాలో ప్రజలు లేకపోవడంతో ఇదే అదనుగా భావించిన దుండగులు మేకలను ఎత్తుకెళ్లారు. తండాకు చెందిన ముత్యాలి బాయి అనే వృద్ధురాలి తన మనుమరాలితో కలిసి జీవనం సాగిస్తోంది. వారి వద్ద మేకలు ఉన్నట్లు గుర్తించిన దుండగులు అర్ధరాత్రి ఇంటికి వచ్చి పోలీసులమి చెప్పి రెండు మేకలను ఎత్తుకెళ్లారని బాధితులు తెలిపారు. ఎవరికి వారు వచ్చి బెదిరిస్తున్నారని తండా వాసులు వాపోతున్నారు. వెంటనే రక్షణ కల్పించాలని కోరుతున్నారు.
మేకలు ఎత్తుకెళ్లారు
మంగళవారం అర్ధరాత్రి పోలీసులు మా ఇంట్లో తనిఖీలు చేశారు. కొడుకు, కోడలు ముంబైలో ఉన్నారని చెప్పాం. ఇంట్లో మగవాళ్లు ఎవ్వరూ లేరని తెలుసుకుని వెళ్లిపోయారు. తెల్లవారుజామున చూస్తే రెండు మేకలు కనిపించ లేదు. పోలీసులు ఎత్తుకెళ్లారో.. లేక దొంగలు ఎత్తుకెళ్లారో అర్థం కావడం లేదు. తండాకు రక్షణ లేకుండా పోయింది. గ్రామంలో పరిస్థితి చక్కబడేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
– ముత్యాలి బాయి, రోటిబండ తండా
మాకు దారేది?
మాకు 3.5 ఎకరాల భూమి ఉంది. ఇందంతా ఫార్మాలో పోతోంది. తరతరాల నుంచి పంటలు సాగు చేసుకుంటూ జీనవం సాగిస్తున్నాం. ఫార్మా కోసం భూములు తీసుకుంటే మేము ఎలా బతకాలి. నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నాను. మూడు రోజులుగా ఇంటర్‌నెట్ సేవలను నిలిపేశారు. ఆన్‌లైన్ క్లాసులు వినలేకపోయా.. అధికారులు మా భవిష్యత్ గురించి ఆలోచన చేయాలి.
– పూజ, విద్యార్థిని, రోటిబండ తండా
పోలీసులు ఏమీ అనలేదు
అధికారులపై దాడి అనంతరం అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం పూర్తిస్థాయిలో వివరాలు సేకరించారు. దాడికి సంబంధించిన వీడియోలను పరిశీలించారు. ఫార్మాసిటీ నోటిఫికేషన్‌లో మా భూములు లేవని చెప్పడంతో వదిలిపెట్టారు.
– మాదారం బిచ్చప్ప, లగచర్ల
ఖాళీగానే దర్శనమిస్తున్న తండాలు
అజ్ఞాతంలో బాధిత రైతులు
నిందితుల కోసం కొనసాగుతున్న పోలీసుల గాలింపు
Comments
Please login to add a commentAdd a comment