మోమిన్‌పేటలో అత్యల్ప ఉష్ణోగ్రత
జిల్లాలో గణనీయంగా
పడిపోతున్న టెంపరేచర్
బషీరాబాద్: జిల్లాలో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. మంగళవారం మోమిన్‌పేటలో 9.8 అత్యల్ప ఉష్ణోగ్రత రికార్డు అయినట్లు జిల్లా వాతావరణ శాఖ అధికారి అశోక్‌కుమార్ తెలిపారు. మర్పల్లిలో 9.9 డిగ్రీలతో రెండో స్థానంలో ఉండగా, బంట్వారం, మన్నెగూడలో 10.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. వికారాబాద్ నియోజకవర్గ పరిధిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండగా, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాలలో కనిష్టంగా 12 డిగ్రీల లోపు కొనసాగుతున్నాయి. దీంతో ఉదయం 10 దాటిన చలిపులి జనాన్ని వణికిస్తూనే ఉంది. పొలం పనులకు వెళ్లే రైతులు సైతం చలి తీవ్రతకు చలిమంటలు కాచుకుంటున్నారు. పల్లెల్లో ఎక్కడ చూసిన ఉన్నిదుస్తులు ధరించి జనం రోడ్ల మీదకు వస్తున్నారు.
కొనసాగుతున్న పోలీస్ భద్రత
దుద్యాల్: మండల పరిధిలోని లగచర్ల, రోటిబండ తండా, పులిచెర్లకుంట తండాల్లో పోలీస్ పహారా కొనసాగుతుంది. లగచర్ల ఘటన తర్వాత ఆయా గ్రామాల్లో నిత్యం పోలీస్ బలగాలు పర్యవేక్షిస్తూనే ఉన్నాయి. రోటిబండ తండా, పులిచెర్లకుంట తండాల్లో గిరిజన సంఘాలకు చెందిన నాయకులు బాధితులను పరామర్శించడానికి వస్తుండడంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోననే భావనతో అధికారులు నిత్యం పోలీస్ బందోబస్తు కొనసాగిస్తున్నారు. ఆయా గ్రామాలకు వచ్చే మార్గాలలో పోలీసులు ప్రతీ ఒక్కరిని ప్రశ్నిస్తూ, సోదా చేస్తున్నారు. దీంతో ఆయా గ్రామాల్లో ఈ నెల11 నుంచి బందోబస్తు కొనసాగుతోంది.
ఉరేసుకొని
కార్మికుడి ఆత్మహత్య
పరిగి: వ్యక్తిగత కారణాలతో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ కార్మికుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని మాదారం గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై సంతోష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని ఉన్నవ్ జిల్లా నారినగర్‌కు చెందిన మోహిత్(31) తన తమ్ముడు సోహిత్ మాదారం గ్రామంలోని పవన్ ప్లైవుడ్ కంపెనీలో లేబర్ పని చేస్తున్నారు. మోహిత్ ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్నప్పుడు ఓ కేసులో జైలుకు వెళ్లి రాగా అప్పటి నుంచి మద్యానికి బానిసయ్యాడు. సోమవారం కంపెనీలో పనికి రాకుండా మద్యం తాగి రూంలో ఉన్నాడు. ఈ క్రమంలో గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రి 10 గంటలకు సోహిత్ పని ముగించుకుని రూంకి వెళ్లి చూడగా మోహిత్ విగతజీవిగా పడి ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తమ్ముడు సోహిత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
బైక్ ఢీకొని.. వ్యక్తికి గాయాలు
తాండూరు రూరల్: బైక్ ఢీకొనడంతో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మంగళవారం మండల పరిధిలోని గౌతపూర్ వద్ద చోటు చేసుకుంది. ఎస్‌ఐ విఠల్‌రెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గోట్లపల్లి సైదప్ప కూలీ పనులు చేస్తున్నాడు. మంగళవారం గౌతపూర్ ప్రధాన చౌరస్తా వద్ద యాక్సిస్ బ్యాంక్‌వైపు రోడ్డు దాటుతుండగా చెంగోల్ నుంచి వస్తున్న ఓ బైక్ సైదప్పను ఢీకొట్టింది. దీంతో ఆయనకు గాయాలు కావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు.ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు.
కిటికీ స్క్రూలు తొలగించి
ఇంట్లో చొరబడి నగదు,
బంగారు, వెండి ఆభరణాల చోరీ
మీర్‌పేట: ఇంట్లో దొంగలు పడి నగదుతో పాటు వెండి, బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు, ఇన్‌స్పెక్టర్ నాగరాజు కథనం ప్రకారం.. ప్రశాంతిహిల్స్‌లోని పింగిళి అపార్ట్‌మెంట్ 101 ప్లాటులో నివాసముండే రాసోజు మోహన్ సోమవారం రాత్రి కుటుంబంతో కలిసి మల్కాజిగిరి మౌలాలిలోని బంధువుల శుభకార్యానికి వెళ్లాడు. తిరిగి మంగళవారం ఉదయం ఇంటికి వచ్చేసరికి తాళాలు పగులగొట్టి బెడ్‌రూంలోని బీరువా తెరిచి ఉంది. అందులో ఉంచిన రూ.5 లక్షల నగదు, నాలుగు తులాల బంగారం, రెండు తులాల వెండి ఆభరణాలు కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దొంగలు కిటికీ స్క్రూలు తొలగించి దొంగతనానికి పాల్పడినట్లు సీసీ టీవీ కెమెరాలో గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్టున్నామని ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment