సొంతూరికి వెళ్లొస్తూ.. అనంత లోకాలకు
షాద్‌నగర్‌రూరల్: స్వగ్రామానికి వెళ్లి వస్తున్న మహిళ.. మరో ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుతానని భావించింది. కానీ విధి ఆడిన నాటకానికి బలైంది. రైలు దిగుతూ కాలు జారి పడటంతో అనంత లోకాలకు చేరుకుంది. ఈ విషాద ఘటన పట్టణంలోని రైల్వేస్టేషన్లో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం వెల్మాల గ్రామానికి చెందిన సురేష్, ఉమ(33) దంపతులు. కుటుంబంతో కలిసి సీఎస్కే విల్లాస్ సమీపంలోని గురురాఘవేంద్రకాలనీలో నివాసం ఉంటున్నారు. సురేష్ మొగిలిగిద్ద సమీపంలోని ఓ పరిశ్రమలో సూపర్వైజర్గా విధులు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. స్వగ్రామం వెల్మాలలో శుభకార్యం ఉండటంతో ఉమ అక్కడకు వెళ్లింది. ఆమె గుంటూరు రైలులో తిరిగి సోమవారం షాద్‌నగర్‌కు బయలుదేరింది. రైల్వే స్టేషన్‌లోని 3వ ఫ్లాట్ ఫాంలో దిగుతుండగా కాలుజారి ప్రమాదవశాత్తు ఆమె రైలు కిందకు వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి భర్త, కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. స్టేషన్ మాస్టర్ మనోహర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు మహబూబ్‌నగర్ రైల్వే ఎస్ఐ అక్బర్ తెలిపారు.
రైలు దిగుతూ జారిపడి మహిళ దుర్మరణం
Comments
Please login to add a commentAdd a comment