నిఘా వైఫల్యం.. నేరాలకు ఆజ్యం
తాండూరు రూరల్: జిల్లాలోనే మేజర్ గ్రామమైన కరన్‌కోట్‌లో నిఘా వైఫల్యం కొట్టొచ్చినట్లు స్పష్టమవుతోంది. ఇటీవల గ్రామంలో ఓ బాలిక అదృశ్యం స్థానికంగా కలకలం రేపింది. దీంతో గ్రామస్తులు చిన్నారులను బయటికి పంపించాలంటే జంకుతున్నారు. మరోవైపు గ్రామంలోని సీసీ కెమెరాలు దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. కరన్‌కోట్ గ్రామం చుట్టూ సిమెంట్ ఫ్యాక్టరీలతో పాటు వందల నాపరాతి గనులు ఉన్నాయి. ఇంతటి ప్రాధాన్యం ఉన్న గ్రామంలో సైతం భద్రత డొల్లతనం బయటపడడం కలవరపెడుతోంది.
10 వేల మంది జనాభా
వ్యాపార పరంగా కరన్‌కోట్ ప్రాంతం అభివృద్ధి చెందింది. గ్రామ శివారులో సీసీఐ ఫ్యాక్టరీతో పాటు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. వందల నాపరాతి గనులు ఉండటంతో ఇక్కడ పని చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి కార్మికులు వలస వచ్చి గ్రామంలోనే నివాసముంటున్నారు. సీసీఐ ఫ్యాక్టరీలో పని చేస్తున్న వివిధ రాష్ట్రాల ప్రజలు కూడా సీసీఐ కాలనీలో ఉంటున్నారు. వ్యాపార పరంగా పేరుగాంచిన కరన్‌కోట్‌లో భద్రత లోపించిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిరుపయోగంగా నిఘా నేత్రాలు
గ్రామంలో సీసీ కెమెరాలు నిరుపయెగంగా మారాయి. గ్రామంలో బంగారమ్మ గుడి, హనుమాన్ దేవాలయంతో పాటు ఓగిపూర్ –కరన్ కోట్ మార్గంలో రూ.లక్షలు వెచ్చించి సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అవి వినియోగంలో లేవు. దీంతో గ్రామంలో ఏదైన సంఘటన జరిగినప్పుడు నిందితులను గుర్తించడం కష్టతరంగా మారింది. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు సీసీ కెమెరాలు వినియోగంలోకి తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు.
కరన్‌కోట్‌లో పనిచేయని సీసీ కెమెరాలు
బాలిక అదృశ్యంతో
ఉలిక్కిపడ్డ గ్రామస్తులు
గాలింపు చర్యలు చేపడుతున్న పోలీసులు
విస్తృతంగా తనిఖీ చేస్తున్నాం
కరన్‌కోట్‌లో బాలిక అదృశ్యమైన సంఘటనకు సంబంధించి విచారణ కొనసాగుతుంది. అమ్మమ్మ లాలమ్మ ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశాం. బాలిక బస్సు ఎక్కి తాండూరులో దిగిందని తెలిసింది. ప్రస్తుతం రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నాం. గ్రామంలో సీసీ కెమెరాలు ఉపయోగంలో లేకపోవడంతో గుర్తించడం కష్టంగా మారింది. పాప ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నాం. బంధువులను కూడా విచారించి వివరాలు సేకరిస్తున్నాం. – విఠల్‌రెడ్డి, ఎస్‌ఐ, కరన్‌కోట్
Comments
Please login to add a commentAdd a comment