‘చేయూత’ నిచ్చేదెవరు?
● వేలిముద్రలు సరిగా పడక ఇబ్బందులు ఎదుర్కొంటున్న లబ్ధిదారులు
● పంచాయతీ కార్యదర్శుల కోసం
పడిగాపులు
● బ్యాంకు ఖాతాల్లో
జమ చేయాలంటూ విజ్ఞప్తి
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు చేయూత పథకం కింద అందించే పింఛన్ల అమలులో కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. వయసు మళ్లిన లబ్ధిదారులకు వేలిముద్రలు పడక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో గ్రామ కార్యదర్శుల వేలిముద్రల కోసం పడిగాపులు కాస్తున్నారు.
దౌల్తాబాద్: నెల నెల రాష్ట్ర ప్రభుత్వం అందించే చేయూత పింఛన్లను సకాలంలో అందుకోలేక చాలా మంది వృద్ధులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. వేలి ముద్రల కారణంగా ఆలస్యంగా పింఛను నగదు ఇస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. మండలంలో ఆరు వేల ఫింఛన్లకుగాను ఇందులో 800 మంది వృద్ధులు, వితంతువులకు వేలిముద్రలు సరిగ్గా పడక ఆయా గ్రామ కార్యదర్శుల వేలిముద్రల కోసం వేచిచూస్తున్నారు. గ్రామ కార్యదర్శులకు ఏదైనా పని ఉంటే, వారు వచ్చి వేలిముద్రలు వేసే వరకు చాలా మందికి పింఛన్లు రావడంలేదు. మరో మార్గంగా ఆధార్‌కార్డులో వేలిముద్రలు అప్‌డేట్ చేసినా కొంత మందివి నిర్ధారణ కావడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా చోట్ల పోస్టాఫీసులు ఉన్న చోట ఆయా గ్రామాల పోస్టుమాస్టర్లు పింఛను డబ్బులను ఇస్తున్నారు. మరికొన్ని చోట్ల పోస్టాఫీసుల్లో ఖాతాలు తెరిచి నేరుగా వారికి ఆయా అకౌంట్లలో జమ చేస్తున్నారు.
వేలిముద్రలు పడక
చాలా మంది గ్రామాల్లో వృద్ధులు, వితంతువులు ఆధార్ నమోదు ప్రక్రియలో మొదటిసారి తీసుకున్నాకా, వాటిని ఎక్కడా అప్‌డేట్ చేయకపోవడం తీవ్ర సమస్యగా మారింది. ఆధార్ అప్‌డేట్ చేయించాలని వారి కుటుంబ సభ్యులకు తెలియక, అధికారులు సైతం అవగహన కల్పించకపోవడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో సకాలంలో చేయూత పింఛను పొందక, నెలవారీ అవసరాలు తీరక లబ్ధిదారులు మదనపడుతున్నారు.
దుర్వినియోగంపై ఆరోపణలు
మరోవైపు పింఛన్ల పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉత్పన్నమవుతున్నాయి. వేలిముద్రల సాకుతో పలుచోట్ల చేయూత డబ్బులు పక్కదారి పడుతున్నాయని అంటున్నారు. అధికారులు వీటిపైన దృష్టి సారించాలని కోరుతున్నారు. గత ప్రభుత్వంలో నూతన పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి నుంచి వివరాలతో పాటు బ్యాంకు ఖాతాను కచ్చితంగా తీసుకుని ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. ఆ సమయంలో చాలా మంది వృద్ధులు, వితంతువులు బ్యాంకు ఖాతాలు సైతం సేకరించినా అందుకు సంబంధించిన నగదును ఖాతాలో జమ చేయలేదు. ఇప్పటికై నా అధికారులు పింఛన్ డబ్బులను నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేయాలని పింఛన్‌దారులు కోరుతున్నారు.
ఖాతాలో వేయాలి
వయసు మీద పడడంతో చేతికి ఉన్న వేలిముద్రలు అరిగిపోయాయి. కార్యదర్శి వచ్చి వేలిముద్రలు ఇచ్చిన తర్వాత పింఛన్ ఇస్తున్నారు. కొన్నిసార్లు కార్యదర్శి అందుబాటులో లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. సమయానికి మందులకు డబ్బులు అవసరం పడితే కష్టమవుతుంది. బ్యాంకు ఖాతాలో జమ చేస్తే బాగుంటుంది.
– మాణిక్యమ్మ, వృద్ధురాలు, దౌల్తాబాద్
Comments
Please login to add a commentAdd a comment